Last Updated:
పుట్టిన తర్వాత తొలి 28 రోజులు శిశువు జీవితంలో అత్యంత కీలకమైన కాలం. ఈ సమయంలో సరైన తల్లిపాలు, పరిశుభ్రత, ఉష్ణోగ్రత నియంత్రణ, వైద్యుల సూచనలు పాటిస్తే శిశువు ఆరోగ్యంగా ఎదిగే అవకాశాలు పెరుగుతాయి.
పిల్లలు పుట్టడం ప్రతి కుటుంబానికి జీవితంలోనే అత్యంత ఆనందకరమైన క్షణం. అయితే శిశువు జన్మించిన తర్వాత తొలి 28 రోజులు ఎంతో కీలకమైనవని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో శిశువు తల్లి గర్భంలోని సురక్షిత వాతావరణం నుంచి బయటి ప్రపంచానికి అలవాటు పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ దశలో చిన్న నిర్లక్ష్యం శిశువు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే సరైన తల్లిపాలు, పరిశుభ్రత, శరీర ఉష్ణోగ్రత, టీకాలు, ప్రమాద సంకేతాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రిలో నవజాత శిశు నిపుణుడు (నియోనేటాలజిస్టు)గా పనిచేస్తున్న డాక్టర్ హేమంత్ శర్మ మాట్లాడుతూ.. పుట్టిన తర్వాత తొలి 28 రోజులు శిశువు జీవితంలో అత్యంత సున్నితమైన దశ అని తెలిపారు. ముఖ్యంగా నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు, తక్కువ బరువుతో జన్మించిన వారు, పుట్టిన వెంటనే ఏడవని పిల్లలు లేదా ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న నవజాత శిశువుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డాక్టర్ హేమంత్ శర్మ వివరించిన ప్రకారం.. గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు సుమారు 37 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన సురక్షిత వాతావరణం ఉంటుంది. అక్కడ వేడి, చలి, శబ్దం లేదా ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. కానీ జననం తర్వాత ఒక్కసారిగా బయటి వాతావరణంలోకి రావడంతో ఉష్ణోగ్రత, గాలి, పర్యావరణ మార్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో కొందరు తల్లిదండ్రులు బిడ్డకు ఎక్కువ దుస్తులు వేయడం, మరికొందరు తక్కువ దుస్తులు వేయడం వల్ల శిశువు అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా సమయానికి తల్లిపాలు అందకపోతే రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
నవజాత శిశువులలో తొలి వారం అత్యంత ప్రమాదకరమైన దశగా భావిస్తారు. చలి, వేడి, ఆకలి, ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని వారు తట్టుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది కొత్త తల్లిదండ్రులకు శిశు సంరక్షణపై సరైన అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ఏడాది లోపు పిల్లల మరణాల్లో దాదాపు సగం మరణాలు పుట్టిన తొలి 28 రోజుల్లోనే జరుగుతుండగా, వాటిలో సుమారు 40 శాతం తొలి ఏడు రోజుల్లోనే నమోదవుతున్నాయని డాక్టర్ హేమంత్ తెలిపారు. కాబట్టి మొదటి వారం శిశువు ఆరోగ్యంగా గడిస్తే భవిష్యత్తులో ఆరోగ్యంగా పెరిగే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు.
పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కొందరు సంప్రదాయాల పేరుతో తేనె, డబ్బా పాలు ఇవ్వడం ప్రారంభిస్తారని, ఇది పూర్తిగా తప్పు అని డాక్టర్ హేమంత్ స్పష్టం చేశారు. సాధారణ ప్రసవం అయితే వెంటనే, సిజేరియన్ అయినా అరగంటలోపే తల్లిపాలను ప్రారంభించాలని సూచించారు. ముఖ్యంగా తల్లి నుంచి మొదట వచ్చే చిక్కటి పసుపు రంగు పాలు (కొలస్ట్రమ్) శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని అందించే అమూల్యమైన ఆహారమని వివరించారు.
శిశువు ఉండే గది ఉష్ణోగ్రత 26 నుంచి 27 డిగ్రీల మధ్య ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అధిక చలి లేదా అధిక వేడి రెండూ శిశువుకు హానికరమని తెలిపారు. మొదటి వారం నుంచి పది రోజుల వరకు శిశువుకు పూర్తిగా స్నానం చేయాల్సిన అవసరం లేదని, తడి, మృదువైన గుడ్డతో శుభ్రం చేసి వెంటనే పొడి బట్టలు వేయాలని సూచించారు.
నవజాత శిశువుకు పాలిచ్చే విషయంలో ఖచ్చితమైన సమయ పట్టిక అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. శిశువు మేల్కొని నోరు కదపడం, చేతిని నోట్లో పెట్టుకోవడం లేదా ఆకలి సంకేతాలు ఇవ్వగానే తల్లిపాలు ఇవ్వాలి. రోజుకు 8 నుంచి 12 సార్లు పాలు తాగడం సహజమేనని తెలిపారు. ముందుగా ఒకే రొమ్ము నుంచి పూర్తిగా పాలు తాగనివ్వాలని, ఎందుకంటే ప్రారంభంలో పలుచటి పాలు, చివర్లో ఎక్కువ పోషకాలు కలిగిన చిక్కటి పాలు వస్తాయని వివరించారు.
పరిశుభ్రత విషయంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని డాక్టర్ హేమంత్ హెచ్చరించారు. శిశువును ఎత్తుకునే ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్ ఉపయోగించడం అవసరమని చెప్పారు. మొబైల్ ఫోన్లు కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయని, జలుబు, దగ్గు లేదా జ్వరం ఉన్నవారు కొద్ది రోజుల పాటు శిశువుకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా నవజాత శిశువును ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించవచ్చని వైద్యులు తెలిపారు.
Hyderabad,Telangana

