ఏపీ ఆర్ కాలేజీ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల చేయూత..
62 సీలింగ్ ఫ్యాన్ల విరాళం.
జి. కె. వీధి , ప్రభ న్యూస్ జూలై 20:
తాము చదువుకున్న విద్యాసంస్థ అభివృద్ధికి చేయూతనందించాలనే సంకల్పంతో ఏపీ ఆర్ కాలేజ్, చింతపల్లి 1990–92 బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.1.25 లక్షల విలువైన సామగ్రిని కళాశాలకు విరాళంగా అందజేశారు. కళాశాల తరగతి గదులకు అవసరమైన 62 సీలింగ్ ఫ్యాన్లుతో పాటు వాటి ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ సామగ్రిని శనివారం కళాశాల ప్రిన్సిపాల్‌కు అందించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, తమకు విద్యను అందించిన కళాశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఈ వస్తువులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడంతో పాటు, భవిష్యత్ విద్యార్థులకు కూడా ఉపయోగపడేలా సంరక్షించాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, పూర్వ విద్యార్థులు చూపిన సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. వారి ఉదారత వల్ల విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 1990–92 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు దుర్గారావు, అబ్దుల్ నబీ, దుర్యోధన్, పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు యు.వి. గిరి, ప్రధాన కార్యదర్శి కుడుముల వెంకటరమణ, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సామాజిక బాధ్యత, కళాశాల పట్ల వారి అనుబంధాన్ని కళాశాల యాజమాన్యం అభినందించింది.

