Last Updated:
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటని, నారీ శక్తికి న్యాయం జరగకుండా ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగ రూపకల్పనలో మహిళల పాత్రను గుర్తుచేసుకుంటూనే, చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించే బిల్లును విపక్షాలు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం మనందరికీ సిగ్గుచేటని మోదీ అన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు రాజ్యాంగ విలువల పట్ల తమకున్న నిర్లక్ష్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నాయని ఎక్స్ వేదికగా విమర్శించారు.
భారత నారీ శక్తికి న్యాయం జరగకుండా ఏ శక్తీ ఆపలేదని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సహా విపక్షాలు ‘విరోధ్ పక్షం’ (ప్రతిపక్షం) లాగా కాకుండా, ప్రజాస్వామ్య ప్రక్రియలను అడ్డుకునే ‘అవరోధ్ పక్షం’గా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2029 సాధారణ ఎన్నికల నాటికి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వేగంగా అమలు చేసేందుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (2026) ఏప్రిల్ 17న లోక్సభలో వీగిపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ (352 ఓట్లు) లభించకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభలో వీగిపోయిన తొలి రాజ్యాంగ సవరణ బిల్లు ఇదే కావడం గమనార్హం.
లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి గరిష్టంగా 850కి పెంచడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో ఈ బిల్లును ప్రభుత్వం అనుసంధానించింది. 2023 నాటి ‘నారీ శక్తి వందన్ అధినీయం’ (106వ సవరణ) అమలుకు ఇది అవసరమని కేంద్రం వాదించగా, జనాభా ఆధారిత డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ బిల్లు వీగిపోవడంతో దానికి అనుబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని, కానీ సభా కార్యక్రమాలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ప్రధాని మోదీ తన సందేశంలో హితవు పలికారు.

