Last Updated:
లేడీ సూపర్ స్టార్ నయనతార లాగే ఉండే మరో మహిళ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నయన్ పేరు నెట్టింట మారుమోగిపోతోంది. ఆ సంగతేంటో చూద్దామా..
సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలను పోలిన వ్యక్తులు రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారడం మనం తరచూ చూస్తుంటాం. తాజాగా దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార లాగే ఉండే మరో మహిళ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నయన్ పేరు నెట్టింట మారుమోగిపోతోంది. ఈ వీడియో చూసి అరె, అచ్చం నయనతార లాగే ఉందిగా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఆమె ఎవరు అని కూడా ఆరా దీస్తున్నారు.
ఇటీవల ఒక షాపింగ్ మాల్‌లో చిన్న పిల్లలు ఆడుకుంటుండగా, వారిని చిరునవ్వుతో ఆస్వాదిస్తూ నిలబడి ఉన్న ఒక మహిళ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్న మహిళ కళ్లు, ముక్కు, చిరునవ్వు, జుట్టు కట్టుకున్న తీరు అన్నీ అచ్చం నయనతారను పోలి ఉన్నాయి. దీంతో కొందరు నెటిజన్లు ఇది నయనతార పాత వీడియో లేదా ఏదైనా సినిమా షూటింగ్‌లోని దృశ్యం అయి ఉంటుందని భావించి కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఆమె ఎవరా అని నెటిజన్లు ఆరా తీయగా ఆసక్తికరమైన నిజం బయటపడింది.
This is last superstar
@grok verify what happened to her https://t.co/OuknzcBGrw— Swetha (@Swetha_xai) November 24, 2026
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్నది నయనతార కాదు, ఆమె పేరు దీప్తి కళ్యాణి. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన ట్రాన్స్‌జెండర్ మోడల్, మేకప్ ఆర్టిస్ట్, నటి. తన ప్రతిభతో మలయాళ సినీ పరిశ్రమలో, ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ ఒక్క మాల్ వీడియో వైరల్ కావడంతో ఆమె పేరు ఒక్కసారిగా దక్షిణాది అంతటా మార్మోగిపోయింది. నెటిజన్లు ఆమెను ‘జూనియర్ నయనతార’, ‘నయనతార ట్విన్’ అంటున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంపై దీప్తి కళ్యాణి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఎప్పుడూ, ఎక్కడా నయనతారలా ఉంటానని ప్రచారం చేసుకోలేదని, కేవలం తన వృత్తిపైనే దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తున్నానని చెప్పారు. కాకపోతే సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్ హీరోయిన్‌తో జనం తనను పోలుస్తుండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు.
మరోవైపు, ఈ వైరల్ వీడియోల వెనుక జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కూడా స్పష్టత వచ్చింది. కొందరు సోషల్ మీడియా యూజర్లు కేవలం లైకులు, వ్యూస్ సంపాదించుకోవాలనే ఆశతో దీప్తి కళ్యాణి వీడియోలను షేర్ చేస్తూ “నయనతార ఎలా మారిపోయిందో చూడండి” అంటూ తప్పుదారి పట్టించే క్యాప్షన్లు పెడుతున్నారు. దీనివల్ల సాధారణ ప్రేక్షకులు ఆవిడ నిజంగానే నయనతార అని నమ్మి అయోమయానికి గురవుతున్నారు.

