ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అశోక్ నగర్ కాలనీవాసుల ఆందోళన
కామారెడ్డి, ప్రభ న్యూస్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈరోజు మండల అధికారులు, సర్వేయర్లు, రెవెన్యూ ఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్లు బాధితులకు నోటీసులు అందజేయడంతో కాలనీవాసులు తమ ఇళ్లను కూల్చవద్దని, కాలనీ మీదుగా ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టవద్దని ఎమ్మార్వోతో పాటు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణం వల్ల సుమారు 100 నుంచి 300 కుటుంబాలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం వైపు నుంచి పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని సూచించారు. 2009 నుంచే ఈ ప్రాజెక్టు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఇప్పటివరకు స్థానిక ప్రజలకు, నాయకులకు సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం మున్సిపల్ అధికారులు ఇదే ప్రాంతంలో భవన నిర్మాణ అనుమతులు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్న అధికారులు, స్థానికంగా ప్రతిపాదనలు పంపినప్పుడే ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించి ఉంటుందని, ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల తొలగింపునకు నోటీసులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు.

