Last Updated:
మనీలాండరింగ్ కేసులో బెయిల్‌పై విడుదలైన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు హైదరాబాదీ బిర్యానీని ఇష్టపడరని వ్యాఖ్యానించారు.
మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ పొంది జైలు నుంచి విడుదలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత ఆజం ఖాన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. రాంపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉత్తరప్రదేశ్ ప్రజలకు ‘హైదరాబాదీ బిర్యానీ’ నచ్చదని, ఇక్కడి వారికి ‘పులావ్’, ‘మటన్ బిర్యానీ’ మాత్రమే ఇష్టమని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసేందుకు ఒవైసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆజం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
దాదాపు 20 శాతం ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఎంఐఎం ఇప్పటికే చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఎస్పీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చకుండా ఉండేందుకే ఆజం ఖాన్ ఒవైసీపై ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఆజం ఖాన్ స్పందిస్తూ.. “ఇకపై జరిగేవి సాధారణ ఎన్నికలు కావు, అదొక విప్లవం. ప్రజలు కులం, మతం పేరుతో కాకుండా సమస్యల ఆధారంగా ఓట్లు వేస్తారు” అని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాణాలర్పించడానికైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు.
#WATCH | Rampur, UP: SP leader Azam Khan says, “In our region, ‘Hyderabadi biryani’ is not preferred. People here prefer ‘pulao’ and mutton biryani…” https://t.co/pgFAj69cSQ
— ANI (@ANI) November 19, 2026
తనపై నమోదైన కేసులపై ఆజం ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. పిల్లల కోసం పాఠశాలలు, యూనివర్సిటీ స్థాపించిన తనను మాఫియా అంటారా అని ప్రశ్నించారు. కోళ్లు, మేకలు, గేదెలు దొంగిలించాడంటూ తనపై ఈడీ కేసులు పెట్టడం హాస్యాస్పదమని, అలాంటి దొంగలు ప్రతి వీధిలో పుట్టి యూనివర్సిటీలు కట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వ్యంగ్యంగా అన్నారు.
అక్టోబర్ 31న ఈడీ అరెస్ట్ చేయగా, అరెస్ట్ కారణాలను లిఖితపూర్వకంగా ఇవ్వలేదని అలహాబాద్ హైకోర్టు ఈ వారం ఆజం ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన గురువారం జైలు నుంచి బయటకు వచ్చారు.

