Last Updated:
Trump: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ విద్యార్థులందరికీ అక్కడి న్యాయస్థానం భారీ ఊరటనిచ్చింది.
విదేశీ విద్యార్థులు (ఎఫ్-1 వీసా), పరిశోధకులు (జే-1), విదేశీ పాత్రికేయులు (ఐ వీసా) అమెరికాలో ఉండే కాలావధిపై పరిమితులు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది జులైలో ప్రతిపాదించిన కొత్త నిబంధనలను బోస్టన్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు బోస్టన్ ఫెడరల్ జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ సోమవారం సంచలన తీర్పు వెలువరించారు.
ఫెడరల్ జడ్జి ఆగ్రహండిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రతిపాదించిన నూతన వీసా విధానం నిరంకుశంగా, వివేకరహితంగా, చట్ట విరుద్ధంగా ఉందని జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. “విదేశీ విద్యార్థులకు అమెరికాలో విద్యావకాశాలు కల్పించడాన్ని అమెరికా కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. ఇక్కడ వారి చదువును అనుమతిస్తోంది. కానీ వారు మన దేశంలో ఉండే కాలావధిపై పరిమితులు విధిస్తూ డీహెచ్ఎస్ ప్రతిపాదించిన కొత్త విధానం కాంగ్రెస్ ఉద్దేశానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఎఫ్-1 వీసా కార్యక్రమాన్ని బలహీనపరిచే అధికారం డీహెచ్ఎస్కు లేదు” అని జడ్జి తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ తీర్పు పట్ల ‘ద ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్)’ హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించింది.
పాత విధానం ప్రకారం ఎఫ్-1, జే-1 వీసాదారులు తమ కోర్సు లేదా పరిశోధన పూర్తయ్యేంత వరకు, ఆ తర్వాత కూడా నిబంధనలకు లోబడి అమెరికాలో కొనసాగేందుకు అనుమతి ఉండేది. అయితే ట్రంప్ ప్రభుత్వం దీనిలో కఠిన మార్పులు తెస్తూ ప్రతిపాదనలు చేసింది.
నాలుగేళ్ల పరిమితి: విదేశీ విద్యార్థులు, పరిశోధకుల కాలావధిని గరిష్ఠంగా నాలుగేళ్లకే పరిమితం చేశారు. ఆ తర్వాత కూడా అమెరికాలో ఉండాలంటే మళ్లీ ఇమిగ్రేషన్‌కు దరఖాస్తు చేసుకుని ఫెడరల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.గ్రేస్ పీరియడ్ కుదింపు: చదువు లేదా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) పూర్తయ్యాక అమెరికాను వీడేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు.
జర్నలిస్టుల వీసాపై కోత: ఐ వీసాదారులు (విదేశీ పాత్రికేయులు) అమెరికాలో ఐదేళ్ల వరకు ఉండేందుకు పాత నిబంధనలు అనుమతిస్తుండగా, కొత్త విధానంలో దాన్ని 240 రోజులకు కుదించారు. చైనా జర్నలిస్టులకైతే ఈ గడువును కేవలం 90 రోజులకే పరిమితం చేశారు. ఈ నూతన విధానంపై బోస్టన్ జడ్జి సెప్టెంబరులోనే ప్రాథమిక ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేయగా, దానిపై డీహెచ్ఎస్ ఫస్ట్ సర్క్యూట్లో అపీలు దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో అపీళ్ల కోర్టు త్వరలోనే తుది తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి.

