ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను వివరించి, కరువు ప్యాకేజీ నిధులు మంజూరు చేయాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు, ఖేలో ఇండియా పోటీల ప్రారంభానికి హాజరుకావాలని ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.
తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో చొరవ చూపాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి, ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పర్యావరణ మంత్రిత్వ శాఖ జాప్యం వల్ల ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని ప్రధానికి వివరించారు. తుమ్మిడిహెట్టి-ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలిపి, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. అలాగే సమ్మక్క-సారక్క బ్యారేజీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశామని, పరిహారం ఎంతైనా చెల్లిస్తామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఇప్పటికే చెప్పామని ఉత్తమ్ వెల్లడించారు.
తెలంగాణలో రూ. 2 వేలు ఉన్న చేయూత పెన్షన్‌ను త్వరలోనే రూ. 4 వేలకు పెంచుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. నల్గొండలో నూతన పెన్షన్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను దశలవారీగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని తెలిపారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ షాపుల్లో నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించి పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతల పదవులకు గౌరవం లేనట్లుందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన గిగ్ వర్కర్ల ర్యాలీ పరిణామాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. గాంధీ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి బాడీగార్డుగా మారారని విమర్శించారు. రాహుల్ గాంధీ బైక్ వెంట మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పరుగులు తీయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా అమిత్ షా చెప్పులు మోశారని గుర్తుచేశారు. తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న గడ్డ అని, ఈ రెండు జాతీయ పార్టీలు ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాధనాన్ని దోచుకోవడం, భార్యాభర్తల వ్యక్తిగత సంభాషణలను వినడమే ‘డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్’ అని ఆయన బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. తాను తన గురువుల కాళ్లు మొక్కడంపై వస్తున్న విమర్శలకు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను బరాబర్ మా గురువుల కాళ్లు మొక్కుతా.. మీ లెక్క చెప్పులు ఎత్తుకుపోయే వాడిని కాదు.. గురువు కాళ్లను గుంజేవాళ్లం కాదు, మీ లెక్క మంది కొంపలు ముంచే విలువలు మాకు మా గురువులు నేర్పలేదు’ అని స్పష్టం చేశారు. సంస్కారం, విలువలతో కూడిన రాజకీయాలు తమవి అని ఆయన తేల్చిచెప్పారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు తుపాను ముందస్తు హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి 840 కి.మీ., విశాఖపట్నానికి 1,010 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత ఈ తుపాను ఏపీ తీరప్రాంతం వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కుమార్తె అంజలి వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ ఆమె సీఎంకు స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. కొత్త జంటను ఆశీర్వదించేందుకు తప్పకుండా విచ్చేయాలని షర్మిల ఆహ్వానించారు. రాజకీయ విభేదాలకు అతీతంగా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆహ్వానాన్ని స్వీకరించిన సీఎం చంద్రబాబు, వివాహ వివరాలను అడిగి తెలుసుకుని తన శుభాకాంక్షలు తెలియజేశారు.
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి రెండు విమానాలు ఢీకొన్నాయి. పనామా సిటీ నుంచి 166 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ల్యాండైన కోపా ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై కదులుతుండగా పక్కనే ఉన్న కార్గో విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమాన భాగాలు దెబ్బతినగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై కోపా ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెబుతూ దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు తెలిపింది. రెండు నెలల క్రితం కూడా ఇదే విమానాశ్రయంలో జరిగిన కార్గో విమాన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నటి రమ్యకృష్ణ తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను 14 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి అడుగుపెట్టానని, ‘అమ్మోరు’ సినిమా షూటింగ్ కోసం ఎంతో కష్టపడ్డానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో 10 చేతుల సన్నివేశం కోసం ఉదయం నుంచి కర్రకు కట్టేసి ఉంచేవారని, నిజమైన ఆయుధాలు పట్టుకుని కదలకుండా ఉండేదాన్నని తెలిపారు. అలాగే, తాను మరియు దర్శకుడు కృష్ణవంశీ ఇప్పటికీ దంపతులమేనని, అయితే కెరీర్, బాబు చదువు కారణంగా చెన్నై, హైదరాబాద్‌లలో వేర్వేరుగా ఉంటున్నామని రమ్యకృష్ణ స్పష్టం చేశారు. తామిద్దరం మంచి స్నేహితుల్లా ఎంతో సంతోషంగా ఉన్నామని, ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోమని ఆమె పేర్కొన్నారు.
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘క్రేజీ కళ్యాణం’ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 20 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. భద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది.
