Last Updated:
రామాయణం సినిమాలో సీతగా సాయి పల్లవి నటించడంపై పలు చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలో ఈ రోల్ పై ధనుష్ రియాక్ట్ అయిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పాన్ ఇండియా పౌరాణిక అద్భుతం ‘రామాయణ’ (Ramayana) చిత్రంలో సీతాదేవి పాత్రకు నేచురల్ బ్యూటీ సాయిపల్లవిని (Sai Pallavi) ఎంపిక చేయడంపై ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కొందరు ఆమె ఎంపికను సమర్థిస్తుండగా, మరికొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయిపల్లవికి కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ (Dhanush) బాసటగా నిలిచారు. సీత పాత్రకు సాయిపల్లవి నూటికి నూరు శాతం న్యాయం చేస్తుందని, ఆ పాత్రలో ఆమెను మించిన నటి భారతీయ చిత్రసీమలో మరొకరు లేరని ఆయన స్పష్టం చేశారు.
ధనుష్, సాయిపల్లవి జంటగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఓం’ (OM)ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న ధనుష్.. సాయిపల్లవి వ్యక్తిత్వంపై, నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. సీత పాత్రలో ఆమె ఎంపికపై వస్తున్న విమర్శలను చూసి తాను ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. “సాయిపల్లవి మనసు చాలా స్వచ్ఛమైనది. ఆమెకు దేవుడిపై అపారమైన భక్తి ఉంది. సెట్స్ లో షూటింగ్ విరామ సమయాల్లోనూ ఆమె నిరంతరం ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా.. సహజత్వంతో అద్భుతంగా నటిస్తుంది. సీతమ్మ వారి పాత్రలో ఆమె కంటే అద్భుతంగా ఇంకెవరూ ఒదగలేరు” అని ధనుష్ పేర్కొన్నారు.
గతంలో సెన్సేషనల్ హిట్ ‘రౌడీ బేబీ’ సాంగ్ ఉన్న ‘మారి 2’ చిత్రంలో ఈ హిట్ పెయిర్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ‘ఓం’ చిత్రం కోసం ఆమెతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. “మారి 2 సమయంలో సాయి పల్లవి చాలా మౌనంగా ఉండేవారు. కేవలం కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడే యాక్టివ్ గా ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆమెలో ఎంతో పరిణితి వచ్చింది. నటనపై అద్భుతమైన పట్టు సాధించింది. ఆమె హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్ అమోఘం. సీత లాంటి పౌరాణిక పాత్రను పోషించడం అంత సులభం కాదు. అయినప్పటికీ, ఆమె తన అంకితభావంతో ఎంతో చక్కగా నటించింది” అని ధనుష్ కితాబిచ్చారు.
ఇక రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ‘ఓం’ చిత్రంలో సాయిపల్లవి మునుపెన్నడూ లేని విధంగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. నిత్యారెడ్డి అనే సిన్సియర్ సీబీఐ అధికారిగా (CBI Officer) ఆమె నటన ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనుంది. భారీ అంచనాల మధ్య ఈ పాన్ ఇండియా చిత్రం నవంబరు 20, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

