Last Updated:
పండుగల సమయంలో భార్య పేరు మీద బంగారం కొనుగోలు చేసివారు చాలామందే ఉంటారు. అయితే భర్త తన డబ్బుతో భార్య పేరుపై బంగారం కొంటే.. భవిష్యత్తులో దాన్ని విక్రయించినప్పుడు పన్ను ఎవరు చెల్లించాలి? …
ధన్‌తేరస్, దీపావళి వంటి పండుగల సమయంలో భార్య పేరు మీద బంగారం కొనడం చాలామంది భర్తలకు అలవాటు. కొందరు బంగారు ఆభరణాలు, నాణేలు, కడ్డీలు కొనుగోలు చేసి భార్య పేరు మీద బిల్లులు తీసుకుంటారు. మరికొందరు తమ డబ్బును భార్యకు ఇచ్చి ఆమె పేరుతో బంగారం కొనుగోలు చేయిస్తారు. అయితే ఇలా కొనుగోలు చేసినప్పుడు వెంటనే ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా, భవిష్యత్తులో ఆ బంగారాన్ని విక్రయించినప్పుడు పన్ను నిబంధనలు వర్తించవచ్చు. ముఖ్యంగా బంగారం కొనడానికి ఉపయోగించిన డబ్బు ఎవరిదనే అంశం ఇక్కడ కీలకం. ఈ విషయంలో దంపతులు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
భర్త తన వెల్లడించిన ఆదాయంతో భార్య పేరు మీద బంగారం కొనుగోలు చేసినంత మాత్రాన వెంటనే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా భార్యకు డబ్బు లేదా ఆస్తిని బదిలీ చేస్తే, దాని ద్వారా వచ్చే ఆదాయం భర్త ఆదాయానికి కలిపే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 99 ప్రకారం జీవిత భాగస్వామికి తగిన ప్రతిఫలం లేకుండా బదిలీ చేసిన ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం క్లబ్బింగ్ నిబంధనల పరిధిలోకి వస్తుందని లండన్‌కు చెందిన కన్సల్టింగ్ సంస్థలో ఇండియా ఫైనాన్స్ లీడ్, చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ రిచా కుమారి వివరించారు.
క్లియర్‌ట్యాక్స్ పన్ను నిపుణురాలు చాందిని ఆనందన్ ప్రకారం, భర్త ఇచ్చిన డబ్బుతో భార్య బంగారం కొనుగోలు చేసి విక్రయించినప్పుడు వచ్చే మూలధన లాభాలకు క్లబ్బింగ్ నిబంధనలు వర్తించవచ్చు. అయితే భార్య తన సొంత ఆదాయంతో లేదా వ్యక్తిగత, గృహ ఖర్చుల కోసం భర్త ఇచ్చే పిన్ మనీతో బంగారం కొంటే ఈ నిబంధనలు వర్తించవు.
భార్య భర్తకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం బంధువు కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి భర్త భార్యకు ఇచ్చే నగదు బహుమతిపై పన్ను ఉండదు. ఈ మినహాయింపుకు నిర్దిష్టమైన గరిష్ఠ పరిమితి కూడా లేదు. అయితే ఆ డబ్బుతో కొన్న బంగారాన్ని విక్రయించినప్పుడు వచ్చే లాభాలకు మాత్రం పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ఆ లాభాలను భర్త ఆదాయానికి కలిపే అవకాశం ఉంటుంది.
బంగారు ఆభరణాలు, నాణేలు, కడ్డీలను 24 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం ఉంచుకుని విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఈ లాభాలపై ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. 24 నెలలకు మించి ఉంచుకుంటే దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించి ఇండెక్సేషన్ లేకుండా 12.5 శాతం పన్ను వర్తిస్తుంది. విక్రయ ధర నుంచి కొనుగోలు ఖర్చు, అర్హత కలిగిన విక్రయ సంబంధిత ఖర్చులను మినహాయించి లాభాన్ని లెక్కిస్తారు.
భార్య పేరు మీద బంగారం కొనడం తప్పు కాదు. కానీ ఆమె ప్రకటించిన ఆదాయానికి మించి భారీ మొత్తంలో కొనుగోళ్లు జరిగితే ఆదాయపు పన్ను శాఖ వివరణ కోరవచ్చు. కొనుగోలు బిల్లులు, చెల్లింపు రసీదులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, నగదు బహుమతి పత్రాలను భద్రపరచుకోవాలని రిచా కుమారి సూచించారు. ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్లు 103, 104 వివరించలేని పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించినవి. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సంతృప్తికరంగా వివరించలేకపోతే ఆ పెట్టుబడిని వివరించలేని పెట్టుబడిగా పరిగణించే అవకాశం ఉంది. భర్త నుంచి భార్య ఖాతాకు డబ్బు బదిలీ అయిన ఆధారాలు, కొనుగోలు బిల్లులు, అవసరమైన చోట విలువ నిర్ధారణ పత్రాలు కూడా భద్రపరచుకోవాలి.
గమనిక: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. పన్ను నిబంధనలు, వ్యక్తిగత పరిస్థితులను బట్టి ప్రభావం మారవచ్చు. బంగారం కొనుగోలు లేదా విక్రయానికి ముందు అర్హత కలిగిన పన్ను నిపుణుడిని సంప్రదించండి.

