Last Updated:
చెవిలో గులిమి పేరుకుపోవడం వల్ల కొన్నిసార్లు వినికిడి సమస్యలు, చెవులు మూసుకుపోయినట్లు అనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే చెవులను శుభ్రం చేసుకునే విషయంలో చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు.
చెవుల్లో గులిమి పేరుకుపోవడం సహజమైన ప్రక్రియ. నిజానికి చెవిలో ఏర్పడే గులిమి దుమ్ము, ధూళి, ఇతర చిన్న చిన్న కణాల నుంచి చెవిని రక్షించడంలో సహాయపడుతుంది. అయితే కొన్నిసార్లు చెవిలో గులిమి ఎక్కువగా పేరుకుపోవడం వల్ల వినికిడి సమస్యలు ఎదురవుతాయి. చెవులు మూసుకుపోయినట్లు అనిపించడం, సరిగ్గా వినిపించకపోవడం వంటి ఇబ్బందులు రావచ్చు. ఇలాంటి సమయంలో చెవులను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చెవి చాలా సున్నితమైన అవయవం కావడంతో శుభ్రం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చెవి లోపలి చర్మానికి గాయాలు కావడం, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
చెవిలో పేరుకుపోయిన గులిమిని మెత్తగా మార్చడానికి కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదా బేబీ ఆయిల్ ఉపయోగపడతాయి. ఇందుకోసం ఎంచుకున్న నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలి. అనంతరం డ్రాపర్ సహాయంతో చెవిలో రెండు నుంచి మూడు చుక్కలు వేయాలి. ఇలా చేసిన తర్వాత తలను కొద్దిసేపు ఒకవైపునకు వంచి ఉంచాలి. ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత తలను సాధారణ స్థితికి తీసుకురావాలి. అనంతరం చెవి బయట భాగాన్ని మెత్తని వస్త్రం లేదా టిష్యూతో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. నూనె గులిమిని మెత్తగా మార్చడంలో సహాయపడుతుంది.
చెవిలో గులిమిని తొలగించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్, నీటిని కూడా ఉపయోగిస్తారు. ఈ రెండింటినీ సమాన పరిమాణంలో అంటే 1:1 నిష్పత్తిలో కలపాలి. ఈ ద్రావణాన్ని డ్రాపర్‌తో చెవిలో వేస్తారు. కొద్దిసేపు తలను వంచి ఉంచి, ఐదు నుంచి పది నిమిషాల తర్వాత తలను పైకి ఎత్తాలి. అనంతరం చెవి బయట భాగాన్ని మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి. అయితే చెవిలో సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా ఇలాంటి ద్రావణాలను ఉపయోగించకూడదు.
గోరువెచ్చని నీటిని ఉపయోగించి కూడా చెవిలోని గులిమిని తొలగించే పద్ధతి ఉంది. ఒక సిరామిక్ లేదా ప్లాస్టిక్ సీసాలో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత నీటిని చెవిలోకి నెమ్మదిగా పంపించి, తలను కిందివైపునకు వంచాలి. ఇలా రెండు నుంచి మూడు సార్లు చేయడం ద్వారా పేరుకుపోయిన గులిమి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చెవిలోని కర్ణభేరికి సమస్యలు ఉన్నవారు ఈ పద్ధతిని ప్రయత్నించకూడదు.
చెవిలో గులిమిని తొలగించేందుకు ఎలాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. వాటితో చెవి లోపలి భాగానికి గాయాలు కావడమే కాకుండా, గులిమి మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. చెవిలో నొప్పి, వాపు, ద్రవాలు బయటకు రావడం లేదా ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తరచూ చెవిలో గులిమి పేరుకుపోతున్నా వైద్యుల సలహా తీసుకోవాలి. చెవిని శుభ్రం చేయడం సాధారణ విషయమే అయినప్పటికీ, సరైన పద్ధతిలో చేయడం చాలా ముఖ్యం.
గమనిక: ఈ కథనంలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. చెవికి సంబంధించిన సమస్యలు ఉంటే సొంతంగా చికిత్స చేసుకోకుండా అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.

