Last Updated:
Dhanteras Gold Offers: ధనత్రయోదశి వేళ బంగారం, వెండి కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆఫ్‌లైన్ నగల దుకాణాలతో పోలిస్తే ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు లభిస్తుండటంతో చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. స్విగ్గీ, బ్లింకిట్‌లో ఏకంగా 78 శాతం వరకు తగ్గింపులు ప్రకటించాయి. ఏ నాణెం ఎంత ధరకు లభిస్తుందో తెలుసుకుందాం.
ఈసారి ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోళ్లలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. గతంలో పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలామంది నేరుగా నగల దుకాణాలకు వెళ్లి బంగారం కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆఫ్‌లైన్ షాపులతో పోలిస్తే ఆన్‌లైన్‌లో రకరకాల డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ప్రత్యేక ఆఫర్లు లభిస్తుండటంతో వినియోగదారులు ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ట్రెండ్ క్రమంగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా క్విక్ కామర్స్ యాప్స్ అందిస్తున్న ఆఫర్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. షాపులకు వెళ్లి సమయం వెచ్చించాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని నచ్చిన బ్రాండ్, డిజైన్ ఎంచుకోవడంతో పాటు తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉండటం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ధనత్రయోదశి సందర్భంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart), బ్లింకిట్ (Blinkit) వంటి ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థలు బంగారం, వెండి నాణేలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. తనిష్క్, కల్యాణ్ జ్యువెలర్స్, మలబార్, MMTC-PAMP, జాయాలుక్కాస్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. కొన్ని ఉత్పత్తులపై ఏకంగా 78 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తున్నాయి. దీంతో ఆఫ్‌లైన్ దుకాణాల్లో కొనుగోలు చేయడం కంటే ఆన్‌లైన్‌లో ధరలు పోల్చుకుని ఆఫర్లు పొందేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో 24 క్యారెట్ల బంగారు నాణేలు ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. కల్యాణ్ జ్యువెలర్స్‌కు చెందిన ఒక గ్రాము ఫ్లవర్ డిజైన్ బంగారు నాణెం అసలు ధర రూ.26,000 కాగా, ఆఫర్‌లో రూ.14,599కే లభిస్తోంది. మియా బై తనిష్క్‌కు చెందిన ఒక గ్రాము లోటస్ డిజైన్ బంగారు నాణెం రూ.22,000 నుంచి తగ్గి రూ.16,639కు అందుబాటులో ఉంది. మలబార్‌కు చెందిన ఒక గ్రాము లక్ష్మీ బంగారు నాణెం రూ.15,879కు లభిస్తోంది. వెండి నాణేలపై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. కల్యాణ్ జ్యువెలర్స్‌కు చెందిన 10 గ్రాముల లక్ష్మీ వెండి నాణెం రూ.2,169కు లభిస్తోంది. గివా సంస్థకు చెందిన 10 గ్రాముల లక్ష్మీ-గణేశుడి డిజైన్ నాణెం రూ.2,499కు, మలబార్‌కు చెందిన 10 గ్రాముల వెండి నాణెం రూ.2,829కు అందుబాటులో ఉంది.
బ్లింకిట్‌లో కూడా బంగారం, వెండి నాణేలపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. MMTC-PAMPకు చెందిన 0.5 గ్రాముల 24 క్యారెట్ల బంగారు నాణెం రూ.29,000 నుంచి తగ్గి రూ.8,380కు లభిస్తోంది. జాయాలుక్కాస్, ముత్తూట్ ఎగ్జిమ్‌కు చెందిన ఒక గ్రాము బంగారు నాణేలు రూ.15,100కు అందుబాటులో ఉన్నాయి. ఇక MMTC-PAMPకు చెందిన 10 గ్రాముల వెండి నాణెం రూ.2,480కు, జాయాలుక్కాస్, ముత్తూట్ ఎగ్జిమ్‌కు చెందిన 10 గ్రాముల వెండి నాణేలు రూ.2,175కు లభిస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం, వెండి స్వచ్ఛత, బరువు, హాల్‌మార్క్, ప్రామాణికత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలి. డిస్కౌంట్ తర్వాత జీఎస్టీ, డెలివరీ ఛార్జీలు కలిపి ఎంత చెల్లించాలో కూడా చూడాలి. ఆన్‌లైన్‌లో కనిపించే ధరలు, ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ధరలను పోల్చుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.

