Last Updated:
స్వీట్లలో మోతిచూర్ లడ్డూలకు ప్రత్యేక స్థానం ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ లడ్డూలను స్వీట్ షాపుల్లో కొనుగోలు చేయకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన కొలతలు, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా మెత్తగా, రుచిగా తయారవుతాయి.
దీపావళి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ స్వీట్లు, పిండివంటల సందడి మొదలవుతుంది. పూజ సమయంలో దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి, ఇంటికి వచ్చే బంధుమిత్రులకు అందించడానికి రకరకాల మిఠాయిలు తయారు చేస్తుంటారు. అలాంటి స్వీట్లలో మోతిచూర్ లడ్డూలకు ప్రత్యేక స్థానం ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ లడ్డూలను స్వీట్ షాపుల్లో కొనుగోలు చేయకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన కొలతలు, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా మెత్తగా, రుచిగా తయారవుతాయి.
కావాల్సిన పదార్థాలు: ఈ లడ్డూల తయారీకి రెండు కప్పుల శనగపిండి, రెండు కప్పుల చక్కెర, పిండి కలపడానికి సుమారు ఒకటింపావు నుంచి ఒకటిముప్పావు కప్పుల నీళ్లు, చక్కెర పాకం కోసం ఒకటిన్నర కప్పు నీళ్లు తీసుకోవాలి. వీటితో పాటు చిటికెడు వంట సోడా, నచ్చితే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్, పుచ్చకాయ గింజలు, డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె సిద్ధం చేసుకోవాలి. వంట సోడా, ఫుడ్ కలర్ ఉపయోగించడం పూర్తిగా మీ ఇష్టం.
ముందుగా బూందీ పిండి సిద్ధం చేసుకోవాలి: ఒక గిన్నెలో శనగపిండి వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ చిక్కగా కాకుండా, కొంచెం పల్చగా ఉండాలి. అవసరమైతే చిటికెడు సోడా, ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసి, సన్నని బూందీ గరిటతో పిండిని నూనెలో వేయాలి. మోతిచూర్ లడ్డూలకు బూందీ చాలా చిన్నగా ఉండాలి. అందుకే గరిటను సున్నితంగా కదుపుతూ పిండిని వేయాలి. బూందీ మరీ గట్టిగా వేయించకుండా స్వల్పంగా వేగిన వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత చక్కెర పాకం తయారు చేయాలి: ఒక పాన్లో రెండు కప్పుల చక్కెర, ఒకటిన్నర కప్పు నీళ్లు వేసి మీడియం మంటపై వేడి చేయాలి. చక్కెర పూర్తిగా కరిగి, పాకం కొద్దిగా జిగురుగా వచ్చే వరకు ఉంచాలి. ఈ లడ్డూలకు తీగ పాకం అవసరం లేదు. పాకం మరీ చిక్కగా మారితే లడ్డూలు గట్టిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకం తయారయ్యే సమయంలో జాగ్రత్తగా గమనించాలి.
బూందీని పాకంలో కలపాలి: ఇప్పుడు సిద్ధం చేసుకున్న బూందీని చక్కెర పాకంలో వేసి చిన్న మంటపై కలుపుతూ ఉండాలి. బూందీ పాకాన్ని పీల్చుకుని మెత్తగా మారే వరకు ఉంచాలి. మిశ్రమం మరీ గట్టిపడకముందే స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా పుచ్చకాయ గింజలు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయే వరకు వేచి ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవడం సులభం.
చివరగా లడ్డూలు చుట్టుకోవాలి: చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, బూందీ మిశ్రమాన్ని చిన్న చిన్న భాగాలుగా తీసుకోవాలి. వాటిని అరచేతులతో మెల్లగా ఒత్తుతూ గుండ్రంగా లడ్డూలుగా తయారు చేసుకోవాలి. మరీ గట్టిగా ఒత్తితే లడ్డూలు మెత్తదనాన్ని కోల్పోతాయి. అంతే.. ఎంతో రుచికరమైన మోతిచూర్ లడ్డూలు సిద్ధం. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ దీపావళికి ఇంట్లోనే ఈ స్వీట్ తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి!

