Last Updated:
విలక్షణమైన కథాంశాలతో సినిమాలను నిర్మిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు నిహారిక కొణిదెల. ఆమెకు చెందిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘పాకెట్ రాకెట్స్’.
విలక్షణమైన కథాంశాలతో సినిమాలను నిర్మిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు నిహారిక కొణిదెల. ఆమెకు చెందిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘పాకెట్ రాకెట్స్’. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో గ్యాంబ్లింగ్, స్నేహం, ప్రేమ, జీవితంలో ఎదురయ్యే అనూహ్య మలుపులను ఆసక్తికరంగా చూపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ పేరుతో టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
టీజర్ ఎలా ఉందంటే?
శ్రీలంకలోని ఓ అందమైన రిసార్ట్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఓ యువకుడితో టీజర్ ప్రారంభమవుతుంది. ‘ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. కల కంటే రియాలిటీనే ఫస్ట్ టైమ్ బావుంది’ అంటూ అతడు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. దీనికి మరో యువకుడు ‘డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోకల్ బస్తీ గయ్స్.. ఐయామ్ ది ఓనర్ ఆఫ్..’ అంటూ స్టైలిష్‌గా సమాధానమిస్తాడు. ఆ వెంటనే గ్యాంబ్లింగ్ జరిగే ప్రాంతాన్ని చూపించడంతో కథపై ఆసక్తి మొదలవుతుంది.
మరోవైపు ఓ బస్తీలో నివసించే ఇద్దరు యువకులు చదువుకుంటూ తమ జీవితాలను కొనసాగించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆర్థిక సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళనల మధ్య ఎప్పటికైనా తమ జీవితం మారుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఇలాంటి సమయంలో వారి జీవితాల్లోకి ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆమె పరిచయం తర్వాత ఇద్దరి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ ఇద్దరు స్నేహితులను ఆమె శ్రీలంకకు ఎందుకు పంపిస్తుంది? అక్కడ గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశాలతో కథ సాగనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనే కలను నెరవేర్చుకోవడానికి ఓ యువకుడు గ్యాంబ్లింగ్‌ను ఎంచుకోవడం కథలో ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో జేడీ చక్రవర్తి పాత్ర పరిచయం కావడం, ఆ తర్వాత కథ కీలక మలుపులు తిరగడం టీజర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూత్‌ఫుల్ కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
నిహారిక కొణిదెలకు చెందిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ హీరోలుగా నటిస్తున్నారు. ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్గా కనిపించనున్నారు. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్యానీ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజేష్ లంకా యాక్షన్ కొరియోగ్రఫీ, జేడీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
మొత్తానికి, శ్రీలంక అందాలు, గ్యాంబ్లింగ్ నేపథ్యం, ఇద్దరు యువకుల జీవితాల్లో వచ్చే అనూహ్యమైన మార్పులు.. ఇలా విభిన్న అంశాలతో రూపొందుతున్న ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.

