Last Updated:
Jio Platforms: ప్రముఖ డిజిటల్, టెలికాం దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.
సెప్టెంబరు 2026తో ముగిసిన రెండో త్రైమాసికం (Q2)లో కంపెనీ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన (YoY) 13.7 శాతం వృద్ధి చెంది రూ. 8,389 కోట్లకు చేరుకున్నట్లు శుక్రవారం వెల్లడించింది. స్టాక్ మార్కెట్లో రికార్డు స్థాయి లిస్టింగ్ సాధించిన తర్వాత కంపెనీ ప్రకటించిన మొట్టమొదటి త్రైమాసిక ఫలితాలు ఇవే కావడం విశేషం. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. సమీక్షా కాలంలో కంపెనీ ఏకీకృత కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 11.4 శాతం పెరిగి రూ. 40,475 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 7,379 కోట్లుగా ఉండగా, తాజా త్రైమాసికంలో అది రూ. 8,389 కోట్లకు పెరిగిందని కంపెనీ స్పష్టం చేసింది.
మునుపటి త్రైమాసికంతో పోల్చినా కంపెనీ బలమైన వృద్ధిని కనబరిచింది. జూన్ త్రైమాసికంలో నమోదైన రూ. 7,765 కోట్ల నికర లాభంతో పోలిస్తే, ఈ త్రైమాసికంలో లాభం క్రమానుగతంగా 8 శాతం పెరిగింది. అలాగే కార్యకలాపాల ఆదాయం సైతం జూన్ త్రైమాసికంలోని రూ. 39,173 కోట్ల నుంచి 3.3 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది.
ఈ వారంలోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన జియో ప్లాట్‌ఫామ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధర రూ. 1,119 కంటే దాదాపు 27 శాతం ప్రీమియంతో ముగిశాయి. దీని ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే రెండో అత్యంత విలువైన దేశీయ కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డులకెక్కింది.
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ఈ షేరు ఒక్కొక్కటి రూ. 1,358 వద్ద లిస్ట్ అయి, ఇష్యూ ధరపై 21.36 శాతం ప్రీమియాన్ని నమోదు చేసింది. ముగింపు సమయానికి బీఎస్‌ఈలో 26.66 శాతం లాభంతో రూ. 1,417.35 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 26.67 శాతం లాభంతో రూ. 1,417.50 వద్ద స్థిరపడింది. బ్లాక్‌బస్టర్ లిస్టింగ్ తర్వాత వెలువడిన ఈ బలమైన త్రైమాసిక ఫలితాలు కంపెనీపై మదుపర్ల నమ్మకాన్ని మరింత పెంచాయి.

