Last Updated:
రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’లో మహిళల పాత్ర చిత్రీకరణపై తలెత్తిన వివాదంపై నటి జాన్వీ కపూర్ తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చిత్రంలో స్త్రీలను కించపరిచేలా చూపించారనే విమర్శలను అంగీకరిస్తూ కాఫీ విత్ కరణ్ షోలో భావోద్వేగంగా మాట్లాడారు.
రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమాపై నడుస్తున్న వివాదంపై హీరోయిన్ జాన్వీ కపూర్ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. ‘కాఫీ విత్ కరణ్’ షోలో మాట్లాడిన ఆమె.. సినిమాలో తన రోల్, మహిళలను చూపించిన విధానంపై వచ్చిన విమర్శలు నిజమేనని ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు. మూవీ టీమ్ పడ్డ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్నాళ్లూ ఏమీ మాట్లాడలేదని, కానీ తన క్యారెక్టర్ చూసి మనసులోనే ఎంతో గిల్టీగా ఫీలయ్యానని చెప్పుకొచ్చారు. సినిమాలో అమ్మాయిలను కేవలం అందాల ప్రదర్శన కోసమే వాడుకున్నారనే మాట వాస్తవమేనని, ఆ సీన్లు సమాజంపై తప్పుడు ప్రభావం చూపిస్తాయని జాన్వీ అన్నారు. ఆ సన్నివేశాలు చేస్తున్నంత సేపూ తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని, ఆ తప్పులో తనకూ భాగం ఉందని కుండబద్దలు కొట్టారు.
చిత్రీకరణ సమయంలో తాను అప్రమత్తంగా ఉండి గట్టిగా నిలదీయాల్సి ఉండేదని జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉన్న స్టార్ ఇమేజ్, హోదాను ఉపయోగించి ఆ సన్నివేశాలను మరింత తీవ్రంగా వ్యతిరేకించి ఉండాల్సిందని భావిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు చెప్పినట్లే చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, సమస్య తీవ్రతను తగ్గించేందుకు తనవంతు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవడమే తన ముందున్న ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత జాన్వీ పాత్రపై, ముఖ్యంగా కొన్ని నిర్దిష్ట సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళలను కేవలం ఒక భోగవస్తువుగా చూపించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు సైతం గతంలో స్పందిస్తూ, సన్నివేశాలు ఇంత వ్యతిరేకత తెస్తాయని ఊహించలేదని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే స్పందించి వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు.

