Last Updated:
పిల్లలపై కోపంతో అరుస్తున్నారా? సైకాలజిస్ట్ చెబుతున్న ఈ చేదు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
ఆధునిక కాలంలో సెల్‌ఫోన్ మనిషి జీవితంలో అత్యంత కీలకమైన వస్తువుగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి నెలకొంది. కానీ అదే సెల్‌ఫోన్ ఇప్పుడు యువత పాలిట ప్రాణాలు తీసే మహమ్మారిగా మారుతోంది. మొబైల్ వాడకంపై తల్లిదండ్రులు చిన్నపాటి మందలింపులు చేసినా తట్టుకోలేకపోతున్నారు. క్షణికావేశానికో, తీవ్రమైన మానసిక ఆందోళనకో లోనై సెల్‌ఫోన్ కోసం నిండు ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ కోసం కన్నవారికి తీరని కడుపుకోత మిగులుస్తూ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న రెండు వేర్వేరు విషాదకర ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జూలై16న చోటుచేసుకున్న తాజా ఘటన ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. స్థానికంగా నివాసం ఉంటున్న శృతి అనే యువతి కేవలం సెల్‌ఫోన్ కోసం ప్రాణాలు తీసుకుంది. ఎప్పుడూ మొబైల్ చూస్తూ సమయం వృథా చేస్తున్నావంటూ తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీనికి తోడు ఆమె అడుగుతున్నా కొత్త ఫోన్ కొనివ్వడానికి నిరాకరించారు. కన్నవారు అన్న ఒక్క మాటకు ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. తన కోరిక తీర్చలేదన్న కోపంతో, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి ఊహించని నిర్ణయం తీసుకుంది. చిన్న కారణానికే ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది.
అచ్చం ఇలాంటి ఘటనే 2024లోనూ చోటుచేసుకుని ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామానికి చెందిన ప్యాగ స్వామి, సమ్మక్క దంపతులకు సాయి సుమ (18) అనే కూతురు ఉంది. ఆమె మంచిర్యాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అనుకోకుండా సుమ చేతిలోంచి కింద పడిపోయి ఆమె మొబైల్ పగిలిపోయింది. వస్తువు పాడైందన్న కోపంతో తల్లిదండ్రులు ఆమెను గట్టిగా మందలించారు. ఆ తర్వాత తనకు కచ్చితంగా కొత్త ఫోన్ కొనివ్వాలంటూ సుమ తల్లిదండ్రులను పదేపదే అడిగింది. వెంటనే అంత డబ్బు పెట్టి కొత్త ఫోన్ కొనివ్వడానికి ఆ తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఏకంగా ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.
న్యూస్18 ప్రతినిధి మస్తాన్ వలీతో ప్యారెంటింగ్ కోచ్, ఫ్రీల్యాన్సర్ సైకిలాజిస్ట్ శైలజ మాట్లాడుతూ పిల్లలు, యువత మనస్తత్వం ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? అనే అంశాలను వెల్లడించారు. ‘‘ఫోన్ చూస్తున్నారని గమనించినప్పుడు.. పిల్లలకు అది ఎలా అలవాటు అయ్యింది? గమనించాలి. చాలా మంది తల్లిదండ్రులు ఏదైనా పనిలో ఉన్నప్పుడు పిల్లలు డిస్ట్రబ్ చేయకూడదనే ఉద్దేశంతో ఫోన్ ఇస్తూ ఉంటారు. అలా చేయొద్దు. పిల్లలు ఒక రోజు గంట ఫోన్ చూశారని అనుకుంటే.. రెండో రోజు 50 నిమిషాలకు తగ్గించాలి. ఇక్కడ తగ్గించేది 10 నిమిషాలు అయినా.. పిల్లలకు క్రమంగా ఫోన్ వాడకాన్ని తగ్గిస్తూ రావాలి. ఇలా రోజు రోజుకు ఫోన్ వాడకాన్ని తగ్గిస్తూ రావాలి. కేకలు వేయొద్దు. ఒకేసారి ఫోన్ లాక్కోవద్దు. ఓపికతో గమనిస్తూ.. క్రమక్రమంగా వాడకాన్ని తగ్గిస్తూ ఉండాలి. అలాగే ఫోన్లో ఏవేవి చూస్తున్నారో గమనించాలి. ఫోన్ లాక్కొని ఒకేసారి గట్టిగా అరిస్తే.. అది వారిపై చెడు ప్రభావం చూపుతుంది. బ్రెయిన్లో రిలీజ్ అయిన హార్మోన్లతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు చనిపోతే బాగుంటుందనే పదాలు ఎట్టిపరిస్థితుల్లో వాడొద్దు. ఇంకా కొంత మంది పిల్లలు కేవలం బెదిరించాలని అనుకుంటారు. కానీ అది తెలియకుండానే కొన్ని సార్లు సీరియర్ కావొచ్చు. ప్రమాదానికి కారణం కావొచ్చు. అందుకే పిల్లలకు మంచి, చెడు చిన్నతనం నుంచే అలవాటు చేయాలి’’ అని వివరించారు.
అలాగే యువత ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, సమాజం కీలక పాత్ర పోషించాలి. పిల్లలతో తల్లిదండ్రులు ప్రతిరోజూ కాసేపు గడుపుతూ, వారి ఆలోచనలు వింటూ స్నేహితుల్లా మెలగాలి. కోపంతో కాకుండా ప్రేమతో మందలించే విధానం అలవర్చుకోవాలి. చిన్నప్పటి నుంచే మొబైల్స్‌కు బదులుగా ఆటలు, పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. వస్తువుల కంటే ప్రాణం ఎంతో విలువైందని వారికి అర్థమయ్యేలా చెబుతూ, జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించే ధైర్యాన్ని నూరిపోయాలి. పిల్లలు గ్యాడ్జెట్స్‌కు తీవ్రంగా బానిసై మానసికంగా కుంగిపోతుంటే వెంటనే సైకాలజిస్టుల ద్వారా సరైన కౌన్సెలింగ్ ఇప్పించాలి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కన్నవారిని జీవితకాలం శోకంలోకి నెడతాయని యువత గ్రహించి, సమస్య ఏదైనా ఇతరులతో మాట్లాడి పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలి.
Hyderabad,Telangana

