Last Updated:
పిల్లలు స్కూల్లో ఎదురైన సమస్యలు, స్నేహితులతో జరిగిన గొడవలు, తమకు కలిగిన బాధలను తల్లిదండ్రులతో పంచుకోలేకపోతే మానసికంగా ఇబ్బంది పడవచ్చు. అందుకే ప్రతిరోజూ కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించడం చాలా ముఖ్యం.
ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడం సాధారణమైపోయింది. ఉదయం లేవగానే పిల్లలను స్కూల్‌కు సిద్ధం చేయడం, వారికి టిఫిన్, లంచ్ బాక్స్ తయారు చేయడం, తాము ఆఫీసుకు వెళ్లేందుకు రెడీ అవ్వడం.. ఇలా రోజంతా ఉరుకుల పరుగుల జీవితమే. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంటి పనులు, పిల్లల హోంవర్క్, ఇతర బాధ్యతలతో సమయం గడిచిపోతుంది. దీంతో పిల్లలతో మనసు విప్పి మాట్లాడేందుకు తల్లిదండ్రులకు తగినంత సమయం దొరకడం లేదు. అయితే ఇలా పిల్లలతో సమయం గడపకపోవడం వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు స్కూల్లో ఎదురైన సమస్యలు, స్నేహితులతో జరిగిన గొడవలు, తమకు కలిగిన బాధలను తల్లిదండ్రులతో పంచుకోలేకపోతే మానసికంగా ఇబ్బంది పడవచ్చు. అందుకే ప్రతిరోజూ కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించడం చాలా ముఖ్యమని సైకాలజిస్ట్ హరీష్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.
ఉదయం పిల్లలతో ఐదు నిమిషాలు గడపండి: ఉదయం లేవగానే ఇంటి పనుల్లో మునిగిపోకుండా పిల్లలతో కనీసం ఐదు నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. వారికి గుడ్‌మార్నింగ్ చెప్పడం, ముద్దు పెట్టుకోవడం, హత్తుకోవడం వంటి చిన్న పనులు పిల్లలకు ఆనందాన్ని ఇస్తాయి. రోజును ప్రేమతో ప్రారంభించడం వల్ల పిల్లలు సంతోషంగా, ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఇంటి పనుల్లో వారిని భాగస్వాములను చేయండి: వంట చేయడం, వస్తువులను సర్దడం, బట్టలను మడతపెట్టడం వంటి చిన్న చిన్న పనుల్లో పిల్లలకు కూడా బాధ్యతలు అప్పగించండి. వారి వయసుకు తగిన పనులను చేయమని చెప్పండి. ఇలా చేయడం వల్ల వారికి కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు తల్లిదండ్రులతో కలిసి సమయం గడిపే అవకాశం లభిస్తుంది.
వ్యాయామం, ఆటల్లో పాల్గొనండి: ఉదయం వాకింగ్‌కు వెళ్లేటప్పుడు లేదా సాయంత్రం వ్యాయామం చేసేటప్పుడు పిల్లలను కూడా మీతో తీసుకెళ్లవచ్చు. అలాగే క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి ఆటలతో పాటు చెస్, క్యారమ్స్, లూడో వంటి ఆటలను కలిసి ఆడండి. ఇవి పిల్లలతో అనుబంధాన్ని పెంచడంలో సహాయపడతాయి.
మొక్కల పెంపకంలో భాగం చేయండి: ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయడం, వాటిని సంరక్షించడం, కొత్త మొక్కలు నాటడం వంటి పనులను పిల్లలతో కలిసి చేయండి. దీని ద్వారా వారికి ప్రకృతిపై ఆసక్తి పెరగడంతో పాటు బాధ్యతగా ఉండటం కూడా అలవడుతుంది.
రోజూ కొంతసేపు మనసు విప్పి మాట్లాడండి: పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదా తల్లిదండ్రులు ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్నాక కొంతసేపు వారితో కూర్చోండి. ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది? స్నేహితులతో ఎలా గడిపారు? ఏదైనా బాధ కలిగించిందా? వంటి ప్రశ్నలను ప్రేమగా అడగండి. వారు చెప్పేది మధ్యలో ఆపకుండా వినండి. ప్రతి సమస్యకు వెంటనే మందలించకుండా, వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
నిద్రపోయే ముందు ఫోన్‌ను పక్కన పెట్టండి: పిల్లలు పడుకునే సమయంలో ఫోన్ చూస్తూ గడపకుండా వారికి సమయం కేటాయించండి. మంచి కథలు చెప్పడం, రోజంతా జరిగిన విషయాల గురించి మాట్లాడటం, వారిని ప్రేమగా హత్తుకోవడం వంటి అలవాట్లను పాటించండి. పడుకునే ముందు ప్రశాంతంగా గడపడం పిల్లలకు భద్రత, ప్రేమ భావనలను కలిగిస్తుంది.
ముఖ్యంగా, పిల్లలతో సమయం గడపడానికి గంటల తరబడి కేటాయించాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కొద్దిసేపైనా ఫోన్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండి వారితో మనస్ఫూర్తిగా మాట్లాడటం ముఖ్యం. తల్లిదండ్రులు తమ మాటలను శ్రద్ధగా వింటున్నారని పిల్లలు భావిస్తే, తమ సమస్యలను ధైర్యంగా పంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా చిన్న చిన్న అలవాట్లను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా పిల్లలతో అనుబంధాన్ని మరింత బలపరచుకోవచ్చు.

