Last Updated:
Dhanush: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ వెండితెర చుట్టూనే తిరుగుతున్నాయి. దళపతి విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వేళ, కోలీవుడ్ నుంచి మరో అగ్ర నటుడు రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ నటుడు ధనుష్ త్వరలోనే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే (AIADMK) కండువా కప్పుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం తమిళనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన తెరవెనుక మంతనాలు వేగవంతమైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇటీవలి ఎన్నికల్లో వరుస పరాజయాలతో మూడో స్థానానికి పడిపోయిన అన్నాడీఎంకేలో ప్రస్తుతం తీవ్ర అంతర్గత పోరు నడుస్తోంది. పార్టీ అధినేత ఈపీఎస్‌ను గద్దె దించేందుకు సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం వర్గం వ్యూహాలు రచిస్తుండగా, షణ్ముగం వర్గానికి చెందిన దాదాపు 100 మందిని పార్టీ నుంచి బహిష్కరించడం కేడర్‌లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తుపై కార్యకర్తల్లో నైరాశ్యం అలుముకుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి, అలాగే దళపతి విజయ్ తెచ్చిన రాజకీయ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి ఈపీఎస్ ‘స్టార్ వార్’ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న ధనుష్‌తో ఈపీఎస్ తనయుడు మిథున్ ఇప్పటికే మూడుసార్లు ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే ధనుష్‌కు జాయింట్ జనరల్ సెక్రటరీ లేదా యువజన విభాగ కార్యదర్శి వంటి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో పళనిసామి ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్న యువ ఓటర్లను, అలాగే ధనుష్‌కు ఉన్న సామాజిక వర్గ మద్దతును తమవైపు తిప్పుకోవాలని ఈపీఎస్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో తన కుమారుడు మిథున్ రాజకీయ భవిష్యత్తుకు కూడా ధనుష్ ఎంట్రీ ఉపయోగపడుతుందని ఆయన నమ్ముతున్నారు. ఇటీవల మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ సైతం ధనుష్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని బహిరంగంగా ప్రకటించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
ధనుష్ తన అభిమాన సంఘాలను ‘సేవా సంఘాలు’గా మార్చి, జెండా రూపకల్పన చేసినప్పటికీ సొంతంగా పార్టీ పెట్టే విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌తో పోలిస్తే ధనుష్‌కు మహిళలు, పిల్లల్లో ఓటు బ్యాంకుగా మారేంత బలమైన ప్రజాదరణ లేకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి కమిటీలను నిర్మించే యంత్రాంగం, భారీ ఆర్థిక వనరులు లేకపోవడం ప్రధాన లోపాలుగా కనిపిస్తున్నాయి. గతంలో రజనీకాంత్ సైతం సంస్థాగత బలం లేకే వెనక్కి తగ్గారు. దీంతో క్షేత్రస్థాయిలో బలమైన పునాదులున్న అన్నాడీఎంకేతో కలిసి నడవడమే తన రాజకీయ భవిష్యత్తుకు శ్రేయస్కరమని ధనుష్ భావిస్తున్నట్లు సమాచారం.
ధనుష్ అన్నాడీఎంకే ఎంట్రీ వెనుక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహం కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విజయ్ రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న తరుణంలో, కోలీవుడ్ సూపర్ స్టార్లైన ‘విజయ్ వర్సెస్ ధనుష్’ మధ్య పొలిటికల్ వార్ సృష్టించి తమ రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నీ కుదిరితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ధనుష్ అన్నాడీఎంకే జెండాతో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

