Last Updated:
తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రచారం సాగుతున్న వేళ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చెన్నైలో 3,000 మంది మహిళా అభిమానులతో సమావేశమవడం సరికొత్త రాజకీయ ఊహాగానాలకు తెరలేపింది.
దళపతి విజయ్ సొంత పార్టీ పెట్టిన తర్వాత కోలీవుడ్ నుంచి మరో అగ్ర నటుడు ధనుష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ఆదివారం చెన్నై శివార్లలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో తన అధికారిక అభిమాన సంఘానికి చెందిన దాదాపు 3,000 మంది మహిళా ప్రతినిధులు, వాలంటీర్లతో 43 ఏళ్ల ధనుష్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల క్రితమే తన ఫ్యాన్స్ అసోసియేషన్ పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మారుస్తూ కోయంబత్తూరులో అధికారికంగా తీర్మానం చేశారు.
చేతులు జోడించి నమస్కరిస్తున్న ధనుష్ ఫోటో, ఎరుపు రంగు స్టార్, ఎరుపు తెలుపు బోర్డర్‌తో సరికొత్త జెండా లోగోను సైతం విడుదల చేయడంతో తమిళ పాలిటిక్స్‌లో పెను సంచలనంగా మారింది.
ధనుష్ తాజా రాజకీయ అడుగులపై తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ మాణిక్యం ఠాగూర్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ తన ప్రయోజనాల కోసం సినీ నటులను ముందుపెట్టి ‘ఆపరేషన్ డి’ మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు. గతంలో రజనీకాంత్‌తో పార్టీ పెట్టించాలని చూశారని, ఇప్పుడు మరో కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే స్వేచ్ఛ ఉంటుందని వ్యాఖ్యానించారు.
మరోవైపు డీఎంకే సీనియర్ నేత రఘుపతి స్పందిస్తూ, విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ధనుష్ ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. గత జూలైలోనే తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమంలో అభిమానులు కేవలం ఆడియో వేడుకలకే పరిమితం కాకుండా ప్రజలకు సేవ చేయాలని ధనుష్ స్వయంగా పిలుపునిచ్చారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆయన కొందరు కేంద్ర స్థాయి రాజకీయ ప్రముఖులను కలిసినట్లు వార్తలు రావడంతో ఆయన పార్టీ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

