మూడు నెలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల
రూ.1.30 కోట్లతో ఐదు తరగతి గదులకు శంకుస్థాపన.. వైఎస్సార్ కాలనీలో విద్యుత్ మీటర్లు, ఇంటి పన్ను ధ్రువీకరణ పత్రాల జారీకి ఆదేశాలు
ఖమ్మం, అక్టోబర్ 24 (ప్రభ న్యూస్):
అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో మూడు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 8వ డివిజన్ వైఎస్సార్ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుడా నిధులు రూ.1.30 కోట్లతో నిర్మించనున్న ఐదు అదనపు తరగతి గదుల పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి రెండు, మూడు వారాలకు ఒకసారి అధికారులు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించి సమీక్షించాలని సూచించారు. వైఎస్సార్ కాలనీలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని, అర్హులైన నివాసితులకు ఇంటి పన్ను ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి ప్రత్యేక విద్యుత్ మీటరు ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు, అక్రమ విద్యుత్ వినియోగానికి తావులేకుండా చూడాలని సూచించారు.

2023లో మంజూరైన రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి ఇంకా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

