గ్రామీణాభివృద్ధికి భారీ నిధులు.. మౌలిక వసతుల కల్పనకు భట్టి విక్రమార్క శ్రీకారం!
చింతకాని మండలంలో రూ.75 కోట్లకు పైగా రహదారి పనులకు శంకుస్థాపనలు.. విద్యుత్ సబ్‌స్టేషన్‌కు రూ.3.5 కోట్లు
చింతకాని, అక్టోబర్ 24 (ప్రభ న్యూస్):
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గ్రామాల్లో రహదారులు, విద్యుత్ వంటి సదుపాయాలను బలోపేతం చేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను ప్రారంభించారు.
పొద్దుటూరు గ్రామంలో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి, తిమ్మినేనిపాలెంలో రూ.8.25 కోట్లతో చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రామకృష్ణాపురం నుంచి కొత్తగూడెం మీదుగా దేవరపల్లి జాతీయ రహదారిని కలిపే మార్గంలో రూ.3 కోట్లతో చేపట్టనున్న బీటీ రహదారి పనులకు, రామకృష్ణాపురం నుంచి పెద్దగోపతి రహదారి వరకు రూ.50 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణ, బలోపేతం పనులకు శ్రీకారం చుట్టారు. కొదుమూరు గ్రామంలో వెంకటపాలెం నుంచి చింతకాని రహదారి వరకు రూ.60 కోట్లతో చేపట్టనున్న నాలుగు వరుసల రహదారి విస్తరణ, బలోపేతం పనులకు శంకుస్థాపన చేశారు. తిమ్మినేనిపాలెం ఎస్సీ కాలనీలో రూ.62 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను, గాంధీనగర్ ఎస్సీ కాలనీలో రూ.46 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మెరుగైన రహదారులతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమవడంతో పాటు ప్రజలకు, రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని, కొత్త విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణంతో పరిసర ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వివరించారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అధికారులు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి ఫలాలు ప్రజలకు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కొదుమూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ వేముల సతీష్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


