Last Updated:
దసరా, దుర్గాపూజ పండుగల వేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఏకంగా 11.40 లక్షల మందికి పైగా సిబ్బందికి 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఇంతకీ ఈ బోనస్ ఎవరెవరికి వర్తిస్తుంది? రైల్వే ఉద్యోగుల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయంలోని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Railway Employees Bonus 2026: దసరా, దుర్గాపూజ పండుగలకు ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అర్హులైన రైల్వే సిబ్బందికి 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 11,40,770 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. పండుగల సమయంలో ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊరట కల్పించడంతోపాటు, రైల్వే సేవల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఈ బోనస్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ బోనస్ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.2,009.61 కోట్లను వెచ్చించనుంది. అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజుల వేతనానికి సమానంగా గరిష్ఠంగా రూ.17,951 వరకు బోనస్ అందుతుంది. రైల్వే సిబ్బందికి ప్రతి సంవత్సరం దుర్గాపూజ, దసరా పండుగలకు ముందు ఈ ప్రోత్సాహకాన్ని అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. విధుల నిర్వహణలో ఉద్యోగులు అందిస్తున్న సేవలను గుర్తించడంతోపాటు, వారి పనితీరును ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది.
ఈ ప్రయోజనం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు వర్తిస్తుంది. ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, పర్యవేక్షకులు, సాంకేతిక సిబ్బంది, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్మెన్, మంత్రిత్వ శాఖ సంబంధిత సిబ్బందితోపాటు ఇతర గ్రూప్-సి ఉద్యోగులు ఈ జాబితాలో ఉన్నారు. రైల్వే కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, సేవల సామర్థ్యం పెంచేందుకు సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేయాలనే లక్ష్యంతో ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు గణనీయమైన పనితీరు కనబరిచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కాలంలో రైల్వేలు రికార్డు స్థాయిలో 1,670 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేశాయి. అదే సమయంలో దాదాపు 7.41 బిలియన్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయి. సరుకు రవాణా, ప్రయాణికుల సేవల్లో సాధించిన ఈ పురోగతి నేపథ్యంలో ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ బోనస్ ప్రకటించారు. దుర్గాపూజ, దసరా పండుగల సమయంలో స్వస్థలాలకు వెళ్లేవారు, కుటుంబాలతో ప్రయాణించేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే సిబ్బందికి ప్రోత్సాహకం అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

