కాంగ్రెస్ సీనియర్ నేత రామగిరి శ్రీనివాస్ మృతి.. కుటుంబానికి మంత్రి వివేక్ ఆర్థిక భరోసా
అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం
ప్రభ న్యూస్ | రామకృష్ణాపూర్, అక్టోబర్ 11:
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామగిరి శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, స్థానిక నాయకులకు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి అండగా నిలిచేందుకు కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ రూ.10,000 ఆర్థిక సాయం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి, తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ రూ.10,000, ‘యువత జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. మొత్తం రూ.30,000 ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కుల సంఘాల అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందించారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించిన నాయకులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎల్పుల సత్యనారాయణ, యువ నాయకులు బొద్దుల ప్రేమ్ సాగర్, గౌస్, కలీమ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

