మత సామరస్యం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు కృషి చేయాలి: సీపీఐ
రామకృష్ణాపూర్, ప్రభ న్యూస్, అక్టోబర్ 2 :
గాంధీజీ చూపిన పోరాట స్ఫూర్తితో దేశంలో మత సామరస్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడుకోవాలని సీపీఐ మంచిర్యాల్ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియం వద్ద గాంధీజీ విగ్రహానికి సీపీఐ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన హక్కులతో జీవించేలా పరిస్థితులు ఉండాలన్నారు.ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం సరికాదని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ, నాయకులు నక్క వెంకటస్వామి, కాదండి సాంబయ్య, కౌన్సిలర్లు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

