Last Updated:
ప్రభుత్వ బ్యాంకులు రుణాలపై వడ్డీతో పాటు బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్ల పంపిణీ ద్వారా కూడా భారీ కమిషన్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.
ప్రభుత్వ బ్యాంకులు ఇక రుణాలపై వడ్డీతో మాత్రమే కాదు.. కమిషన్ ద్వారానూ వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. ముఖ్యంగా బీమా పాలసీల విక్రయాల ద్వారా ఈ ఆదాయం భారీగా పెరిగింది. ఈ విభాగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చాలా ప్రభుత్వ బ్యాంకులు బీమా ఉత్పత్తుల విక్రయాల ద్వారా భారీ కమిషన్ ఆదాయాన్ని పొందాయి. మరోవైపు మ్యూచువల్ ఫండ్ పంపిణీ ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం బ్యాంకు వారీగా భిన్నంగా నమోదైంది. కొన్ని బ్యాంకుల ఆదాయం పెరగగా, మరికొన్నింటిలో తగ్గుదల కనిపించింది.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ వార్షిక నివేదిక ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో బీమా కమిషన్ ఆదాయం 19.26 శాతం పెరిగి రూ.2,795.01 కోట్లకు చేరుకుంది. అంతకుముందు 2024-25లో ఇది రూ.2,345.36 కోట్లు మాత్రమే. అలాగే మ్యూచువల్ ఫండ్ పంపిణీ ద్వారా వచ్చిన కమిషన్ ఆదాయం కూడా 7.05 శాతం పెరిగి రూ.1,617.52 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,511.06 కోట్లుగా నమోదైంది.
ఎస్బీఐ సంపాదించిన మొత్తం రూ.2,795.01 కోట్ల బీమా కమిషన్లో దాదాపు రూ.2,384.63 కోట్లు (సుమారు 85 శాతం) ఎస్బీఐ లైఫ్ బీమా పాలసీల విక్రయాల ద్వారానే వచ్చాయి. అలాగే దేశవ్యాప్తంగా 22 వేలకుపైగా శాఖలు కలిగిన ఎస్బీఐకి మ్యూచువల్ ఫండ్ పంపిణీ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో సుమారు రూ.1,209.33 కోట్లు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచే లభించాయి. ఈ ఆదాయం పెరుగుతున్న సమయంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులకు తప్పుదోవ పట్టించే విధంగా ఉత్పత్తులను విక్రయించవద్దని హెచ్చరించింది. అలాగే తమ ప్రధాన బ్యాంకింగ్ సేవలపైనే దృష్టి పెట్టాలని సూచించింది.
ప్రభుత్వ బ్యాంకులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) వంటి ప్రభుత్వ బీమా పథకాలను కూడా ప్రజలకు అందించాయి. ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో కెనరా బ్యాంక్ మంచి వృద్ధిని నమోదు చేసింది. బీమా కమిషన్ ఆదాయం 15.67 శాతం పెరిగి రూ.566.36 కోట్లకు చేరగా, గత ఏడాది ఇది రూ.489.64 కోట్లు. మ్యూచువల్ ఫండ్ పంపిణీ కమిషన్ కూడా 8.41 శాతం పెరిగి రూ.72.84 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బీమా కమిషన్ 3.76 శాతం పెరిగి రూ.368.93 కోట్లకు చేరింది. అయితే మ్యూచువల్ ఫండ్ పంపిణీ కమిషన్ మాత్రం 0.82 శాతం తగ్గి రూ.142.52 కోట్లకు పరిమితమైంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కు రెండు విభాగాల్లోనూ ఆదాయం తగ్గింది. బీమా కమిషన్ 8.61 శాతం తగ్గి రూ.438.67 కోట్లకు చేరగా, మ్యూచువల్ ఫండ్ పంపిణీ కమిషన్ 13.14 శాతం తగ్గి రూ.163.41 కోట్లుగా నమోదైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీమా కమిషన్ 10.77 శాతం తగ్గి రూ.475.45 కోట్లకు పడిపోయింది. అయితే మ్యూచువల్ ఫండ్ పంపిణీ ద్వారా వచ్చిన కమిషన్ 7.93 శాతం పెరిగి రూ.29.66 కోట్లకు చేరుకుంది.
మధ్యతరహా ప్రభుత్వ బ్యాంకుల్లో ఇండియన్ బ్యాంక్ బీమా కమిషన్ 8.21 శాతం పెరిగి రూ.190.65 కోట్లకు చేరుకుంది. మ్యూచువల్ ఫండ్ కమిషన్ కూడా 7.73 శాతం పెరిగి రూ.4.74 కోట్లుగా నమోదైంది. యూకో బ్యాంక్ బీమా కమిషన్ 6.53 శాతం పెరిగి రూ.66.08 కోట్లకు చేరగా, మ్యూచువల్ ఫండ్ పంపిణీ ఆదాయం 42.04 శాతం భారీ వృద్ధితో రూ.2.23 కోట్లకు పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీమా కమిషన్ 2025-26లో 13.57 శాతం పెరిగి రూ.160.90 కోట్లకు చేరుకుంది. చిన్న ప్రభుత్వ బ్యాంకుల్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, బీమా కమిషన్ ఆదాయాన్ని 17.92 శాతం పెంచుకుని రూ.31.98 కోట్లకు చేర్చుకుంది.
Hyderabad,Telangana

