ఆర్టీఐ ద్వారా ఎన్నికల సంఘం సమాచారంపై ఆంజనేయులు ఆరా
పుట్టపర్తి, ప్రభ న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 27
భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన పలు అంశాలపై అధికారిక సమాచారాన్ని కోరుతూ సమాచార హక్కు చట్టం–2005 కింద ఆర్టీఐ దరఖాస్తు చేసినట్లు ఏపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గులూరు ఆంజనేయులు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు, నిర్ణయాలు, విధివిధానాలు, సంబంధిత పత్రాలపై చట్టపరంగా అందించగల సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలకు సంబంధించిన అధికారిక రికార్డులు, ఎన్నికల వ్యయాలు తదితర అంశాలపై వివరాలను కోరినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండటం అత్యంత ముఖ్యమన్నారు. ఎన్నికల వ్యవస్థకు సంబంధించి వివిధ అంశాలపై వచ్చే సందేహాలకు రాజకీయ ఆరోపణల కంటే అధికారిక రికార్డులు, వాస్తవ సమాచారంతో స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే ఆర్టీఐ చట్టాన్ని వినియోగించి అధికారిక సమాచారాన్ని కోరినట్లు తెలిపారు.
ఆర్టీఐ ద్వారా అందే సమాచారాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం, అవసరమైతే చట్టపరంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆంజనేయులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వాస్తవ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాస్వామ్య పారదర్శకతకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

