Last Updated:
Trump: అమెరికా-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం వాషింగ్టన్ చేరుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాదర స్వాగతం పలికారు.
సాధారణంగా అమెరికా అధ్యక్షులు విదేశీ నేతలకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లరు. అయితే, సంప్రదాయ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మరీ ట్రంప్ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి జిన్‌పింగ్‌ను ఆహ్వానించడం ప్రపంచవ్యాప్తంగా దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ సైనిక విమానాశ్రయంలో ఎయిర్ చైనా విమానం ల్యాండ్ అవ్వగానే, ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి రన్‌వే వద్దకు చేరుకుని జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్‌లకు ఘన స్వాగతం పలికారు. అమెరికా చరిత్రలో పోప్ పర్యటనలను మినహాయిస్తే.. గతంలో 1959లో సోవియట్ నేత నికితా క్రుష్చెవ్‌కు ఐసన్‌హోవర్, 1962లో బ్రిటన్ ప్రధాని హెరాల్డ్ మాక్మిలన్కు జాన్ ఎఫ్ కెన్నెడీ ఇలా ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఒక విదేశీ దేశాధినేత కోసం అమెరికా అధ్యక్షుడు విమానాశ్రయానికి వెళ్లడం విశేషం.
ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం వాణిజ్యం, సాంకేతికత, భద్రత తదితర అంశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 10వ తేదీతో ఇరుదేశాల మధ్య ఉన్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం గడువు ముగియనుండటంతో, దానిని పొడిగించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
వీరిద్దరి చర్చల్లో టారిఫ్‌లు, రేర్ ఎర్త్ ఖనిజాలు, కృత్రిమ మేధ (AI) వంటి అంశాలు ప్రధాన్యత సంతరించుకోనున్నాయి. అధునాతన సాంకేతికతల ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తుండగా, రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరాపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. వీటితో పాటు తైవాన్ సమస్య, ఇరాన్‌తో చైనా సంబంధాలు వంటి అత్యంత సున్నితమైన అంతర్జాతీయ భద్రతా అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
మూడు రోజుల పర్యటనలో భాగంగా షీ జిన్‌పింగ్‌కు అమెరికా అధికారిక స్వాగత సత్కారాలు, వైట్‌హౌస్‌లో స్టేట్ డిన్నర్ ఏర్పాటు చేసింది. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన, రాజ్యాంగం భద్రపరిచిన ‘నేషనల్ ఆర్కైవ్స్’ను జిన్‌పింగ్ సందర్శించనున్నారు. స్టేట్ డిన్నర్‌కు ఇరు దేశాల వ్యాపార, టెక్నాలజీ దిగ్గజాలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
భేటీకి ఘనంగా ఏర్పాట్లు జరిగినప్పటికీ, ఇరు దేశాల మధ్య పలు అంశాల్లో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే విస్తృత అంశాల్లో వివాదాలు కొనసాగుతున్నప్పటికీ, సాధ్యమైనంత వరకు పరిమిత అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చి వాణిజ్య, రక్షణ ఉద్రిక్తతలను అదుపులో ఉంచడమే లక్ష్యంగా ఈ ద్వైపాక్షిక చర్చలు సాగనున్నాయి.

