Last Updated:
iPhone 18 Pro Sale | ఐఫోన్ 18 ప్రో లాంచ్ రోజునే ఇటలీలోని యాపిల్ స్టోర్ ఉద్యోగులు సమ్మె చేశారు. పని పరిస్థితులు, పనిభారంపై నిరసన వ్యక్తం చేశారు.
కొత్త ఐఫోన్ 18 ప్రో మార్కెట్లోకి వచ్చిన రోజే ఇటలీలోని యాపిల్ స్టోర్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. పని పరిస్థితులు, ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం వంటి అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం రోజంతా ఫిల్కామ్స్ సీజీఐఎల్, ఫియాస్కాట్ సీఐఎస్ఎల్, యూఐఎల్టీయూసీఎస్ అనే కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయని రాయిటర్స్ కథనం వెల్లడించింది. తమ సభ్యులు రోజంతా పని చేయకుండా రోమ్, మిలాన్ సహా ప్రధాన నగరాల్లోని యాపిల్ ప్రధాన స్టోర్ల ముందు నిరసన చేపడతారని సంఘాలు తెలిపాయి. ఫిల్కామ్స్ సీజీఐఎల్, ఫియాస్కాట్ సీఐఎస్ఎల్, యూఐఎల్టీయూసీఎస్ అనే కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. తమ సభ్యులు రోజంతా పని చేయకుండా రోమ్, మిలాన్ సహా ప్రధాన నగరాల్లోని యాపిల్ ప్రధాన స్టోర్ల ముందు నిరసన చేపడతారని సంఘాలు తెలిపాయి. ఈ సమ్మెతో 17 యాపిల్ స్టోర్లలో పనిచేస్తున్న 1,600 మందికి పైగా ఉద్యోగులు ప్రభావితమయ్యారని ఫియాస్కాట్ సీఐఎస్ఎల్ తెలిపింది.
అయితే తమ స్టోర్లు సాధారణంగానే పనిచేస్తాయని యాపిల్ ప్రతినిధి చెప్పారు. “మా రిటైల్, ఆన్లైన్ స్టోర్లు ఈరోజు తెరిచే ఉన్నాయి. ఎప్పటిలాగే మా కస్టమర్లకు స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని యాపిల్ ప్రతినిధి తెలిపారు. ఐఫోన్ 18 ప్రో అమ్మకాలు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గత వారం జరిగిన కార్యక్రమంలో యాపిల్ ఈ ఫోన్‌ను డ్యుయోతో కలిసి పరిచయం చేసింది. డ్యుయో యాపిల్ తీసుకొస్తున్న తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్. ఇది అక్టోబర్ 23న మార్కెట్లోకి రానుంది. ఇటలీలో ఐఫోన్ 18 ప్రో ధరలు 1,489 యూరోలు, అంటే సుమారు 1,710 డాలర్ల నుంచి మొదలవుతాయని యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లో పేర్కొంది.
కొత్త ఐఫోన్ లాంచ్ సమయంలో యాపిల్ రిటైల్ స్టోర్ ఉద్యోగులపై పని భారం మరింత పెరుగుతోందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఉద్యోగుల బాధ్యతలు కూడా స్పష్టత కోల్పోతున్నాయని, కస్టమర్లకు సేవలు అందించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తోందని అవి తెలిపాయి. “ఉద్యోగులతో జరిగిన చర్చల్లో పని పరిస్థితులు మరింత దిగజారుతున్న విషయం స్పష్టమైంది. ఉద్యోగుల సంక్షేమంపై తగినంత శ్రద్ధ చూపడం లేదు” అని ఫిల్కామ్స్ సీజీఐఎల్ పేర్కొంది. ఉద్యోగుల సంఖ్య పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతున్నాయి. అలాగే పార్ట్‌టైమ్ ఉద్యోగులు కోరుకుంటే అదనంగా ఎక్కువ గంటలు పనిచేసే అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు, ఉద్యోగులకు పరిశ్రమలోనే అత్యుత్తమ స్థాయి వేతనాలు, ప్రయోజనాలు అందిస్తున్నామని యాపిల్ ప్రతినిధి చెప్పారు. ఉద్యోగులకు ప్రైవేట్ వైద్య, దంత, కంటి చికిత్స కవరేజీతో పాటు మానసిక ఆరోగ్యం, వెల్నెస్కు సంబంధించిన సపోర్ట్ ప్రోగ్రామ్ కూడా అందిస్తున్నామని తెలిపారు. కొత్త ఐఫోన్ లాంచ్ రోజునే జరిగిన ఈ సమ్మెతో యాపిల్ స్టోర్ ఉద్యోగుల పని పరిస్థితులు, వేతనాలు, ఉద్యోగ భద్రత, పనిభారం వంటి అంశాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. ఉద్యోగుల డిమాండ్లపై కంపెనీ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

