కొత్తగా పెళ్లైన జంటకు మొదటి రోజు ఎప్పటికీ ప్రత్యేకమే. ఒకరినొకరు కొత్తగా చూసుకోవడం.. మాటల్లో చెప్పుకోలేని సిగ్గు.. తెలియని ఆనందం.. మనసులో మొదలయ్యే ప్రేమ.. ఇలా ఆ సమయంలో కలిగే ప్రతి అనుభూతి ఎంతో మధురంగా ఉంటుంది. అయితే ఈ భావాలను ఎలాంటి అసభ్య పదాలకు తావివ్వకుండా, కేవలం కవిత్వం, సంగీతం, అందమైన విజువల్స్‌తో చెప్పగలిగితే ఎలా ఉంటుంది? దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఓ పాట సరిగ్గా ఇదే చేసింది. కొత్త వధువు మనసులోని భావాలను అంత సున్నితంగా ఆవిష్కరించిన ఆ పాట ఇప్పటికీ వినిపిస్తే.. పెళ్లైన కొత్త జంటల మధ్య ఉన్న ఆ మధురమైన క్షణాలు కళ్లముందు కదులుతాయి. అదే షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా నటించిన ‘దిల్ సే’ సినిమాలోని ‘జియా జలే’ పాట.

