హైదరాబాద్ మెట్రోలో రోజూ వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం మెట్రోలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చిన్న తప్పులకు జరిమానా నుంచి తీవ్రమైన నేరాలకు జైలు శిక్ష వరకు పడొచ్చు. 2026 ఆగస్టు 18 నుంచి అమల్లోకి వచ్చిన ‘ఆఫెన్సెస్ అండ్ పెనాల్టీస్’ వివరాల ప్రకారం, మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్, 2002 కింద పలు నేరాలకు జరిమానాలు, ఇతర శిక్షలు ఉన్నాయి. ప్రయాణికులు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు ఇవి. మెట్రోలో మద్యం తాగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం, ఉమ్మివేయడం, రైలులో నేలపై కూర్చోవడం, గొడవపడటం వంటి పనులకు సెక్షన్ 59 కింద రూ.2,500 జరిమానా పడొచ్చు. పాస్ లేదా టికెట్‌ను కూడా రద్దు చేసి, ప్రయాణికుడిని రైలు నుంచి దించేయొచ్చు. ఇతరులకు ఇబ్బంది కలిగించే వస్తువులను మెట్రోలో తీసుకెళ్తే సెక్షన్ 60 కింద రూ.2,500 జరిమానా పడొచ్చు. ఆ వస్తువుల వల్ల ఏదైనా నష్టం జరిగితే దానికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. సెక్షన్ 61 కింద రూ.5,000 జరిమానా, లేదా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష, లేదా రెండూ పడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

