Last Updated:
ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్ హైదరాబాద్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. రూ. 17.99 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. ఆకర్షణీయమైన ఫీచర్లు, విలాసవంతమైన బిజినెస్ క్లాస్ కంఫర్ట్ ఈ కారు ప్రత్యేకతలు.
భారతదేశంలో నంబర్ వన్ ఎలక్ట్రిక్ వాహనంగా (EV) గుర్తింపు పొందిన MG విండ్సర్‌లో సరికొత్త మోడల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘JSW MG మోటర్ ఇండియా’ బుధవారం మార్కెట్లోకి మరింత విలాసవంతమైన ‘MG విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్’ (MG Windsor INDULGE Edition) ను విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 17,99,800 గా సంస్థ నిర్ణయించింది. 38-kWh బ్యాటరీ ప్యాక్‌తో నడిచే ఈ సరికొత్త కారు 136 PS పవర్‌ను, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ చార్జ్‌పై ఇది 332 కిలోమీటర్ల మైలేజ్ (రేంజ్) ఇస్తుందని సంస్థ వెల్లడించింది.
ఆకట్టుకునే సరికొత్త లుక్
విండ్సర్ మోడల్ కు ఉన్న ఫ్యూచరిస్టిక్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్ కు అదనంగా ఈ ఇండల్జ్ ఎడిషన్‌లో మరిన్ని ప్రీమియం ఫీచర్లను జోడించారు. రోడ్‌పై మరింత గంభీరంగా కనిపించేలా ‘షాడో గోల్డ్’ బాడీ కలర్, కాంట్రాస్టింగ్ ‘బ్లాక్ రూఫ్’ తో డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్ ఆకట్టుకోనుంది. ఆర్-18 బ్లాక్ అలాయ్ వీల్స్, సి-పిల్లర్‌పై ప్రత్యేకమైన ‘INDULGE’ బ్యాడ్జింగ్ కారుకు మరింత లగ్జరీ లుక్‌ను తీసుకువచ్చాయి.
క్యాబిన్ లోపల అర్బన్ టాన్, బ్లాక్ అప్హోల్స్టరీ థీమ్ తో పాటు ముందు సీట్ల హెడ్రెస్ట్లపై ‘INDULGE’ ఎంబ్రాయిడరీ డిజైన్ చేశారు. ముఖ్యంగా వెనుక సీటు ప్రయాణికుల వినోదం, సౌకర్యం కోసం స్టాండర్డ్‌గా ‘ప్రివే స్క్రీన్’ (PRIVE Screen) ను అమర్చారు. దీనితో పాటు ప్రీమియం పిల్లోస్, నెక్ కుషన్స్, రియర్ సన్‌షేడ్, 3D మ్యాట్స్, బంపర్ ప్రొటెక్టర్స్ వంటి ప్రత్యేకమైన యాక్సెసరీస్ ప్యాకేజీ కూడా లభిస్తుంది. సెడాన్ కారులో ఉండే సౌకర్యాన్ని, ఎస్యూవీ (SUV) లో ఉండే గంభీరమైన రూపాన్ని కలిపి దేశంలోనే మొట్టమొదటి ఇంటెలిజెంట్ సియువి (CUV) గా దీనిని రూపొందించారు. 135 డిగ్రీల వరకు వెనక్కి వాలగలిగే ‘ఏరో లాంజ్’ సీట్లు, సెంటర్ కన్సోల్‌లో 15.6-అంగుళాల భారీ ‘గ్రాండ్‌వ్యూ’ టచ్ డిస్ప్లే దీని ప్రత్యేకతలు.
ఈ లాంచ్ సందర్భంగా JSW MG మోటర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో MG విండ్సర్ అత్యంత కీలకమైన మైలురాళ్లను అందుకుంటుందని అన్నారు. కేవలం 24 నెలల స్వల్ప వ్యవధిలోనే 80,000 కంటే ఎక్కువ కుటుంబాలు ఈ వాహనాన్ని ఎంచుకోవడం విశేషమన్నారు. కస్టమర్ల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా, విండ్సర్ను మరింత ప్రీమియం లైఫ్‌స్టైల్ వాహనంగా మార్చాలనే లక్ష్యంతోనే ఈ ఇండల్జ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు.

