Last Updated:
పిల్లల పాల పళ్లు సహజంగా ఊడకముందే దెబ్బలు, క్యావిటీ లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ఊడిపోతే శాశ్వత పళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ఖాళీ ప్రదేశంలో పక్క పళ్లు కదలకుండా ఉండేందుకు కొన్ని సందర్భాల్లో స్పేస్ మెయింటెయినర్ అవసరం కావచ్చు. సమస్యను ముందుగానే గుర్తించేందుకు డెంటిస్ట్‌ను సంప్రదించడం మంచిది.
పిల్లల పాల పళ్లు ఒక వయసు తర్వాత సహజంగానే ఊడిపోతాయి. వాటి స్థానంలో శాశ్వత పళ్లు వస్తాయి. అయితే కొన్నిసార్లు పిల్లలు పడిపోవడం, దెబ్బలు తగలడం వంటి కారణాలతో పాల పళ్లు సమయానికి ముందే విరిగి ఊడిపోతాయి. ఇలా జరిగితే తర్వాత వచ్చే శాశ్వత పళ్లపై ప్రభావం పడుతుందా? ఖాళీ అయిన ప్రదేశంలో పక్క పళ్లు కదిలి వస్తాయా? భవిష్యత్తులో పళ్లు సరిచేయడానికి చికిత్స అవసరమవుతుందా? ఈ విషయాలపై ఫరీదాబాద్‌లోని అమృతా హాస్పిటల్ డెంటల్ విభాగానికి చెందిన పిల్లల దంతాల నిపుణురాలు డాక్టర్ మేఘా జైన్ లోకల్ 18తో వివరించారు.
పిల్లల పాల పళ్లు కేవలం ఆహారం నమలడానికి మాత్రమే ఉపయోగపడవు. శాశ్వత పళ్లు సరైన సమయంలో, సరైన స్థానంలో రావడానికి పాల పళ్లు కీలకంగా పనిచేస్తాయి. శాశ్వత పళ్ల కోసం అవసరమైన స్థలాన్ని కాపాడటంతో పాటు, అవి బయటకు వచ్చే దిశను కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే ఏదైనా పాల పన్ను నిర్ణీత సమయానికి ముందే ఊడిపోతే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ పన్ను తొందరగా ఎందుకు ఊడిందో తెలుసుకోవడం ముఖ్యం. కొన్ని సందర్భాల్లో పాల పన్ను ముందుగానే ఊడిపోవడం వల్ల తర్వాత వచ్చే శాశ్వత పన్నుకు అవసరమైన స్థలం తగ్గే అవకాశం ఉంటుంది.
పిల్లల పాల పన్ను సహజంగా ఊడాల్సిన సమయం వచ్చిందా లేదా ముందుగానే ఊడిపోయిందా అనేది ఇంట్లో చూసి తేల్చడం అంత సులభం కాదు. దంత వైద్యుడి పరీక్ష తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది. కొన్నిసార్లు పాల పళ్లకు క్యావిటీ లేదా పురుగు పట్టడం వల్ల అవి బలహీనంగా మారతాయి. మరికొన్ని సందర్భాల్లో పన్ను చుట్టూ చీము, ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యల కారణంగా పాల పన్ను నిర్ణీత వయసు కంటే ముందే తొలగిపోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి పాల పన్ను ముందుగానే ఊడిపోయినప్పుడు పిల్లలను డెంటిస్ట్‌కు చూపించడం మంచిది.
పాల పన్ను ముందుగానే ఊడిపోతే అక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఈ ఖాళీ ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న పళ్లు తమ స్థానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. వెనుక ఉన్న పన్ను ముందుకు రావడం, ముందు ఉన్న పన్ను వెనక్కి కదలడం వంటి మార్పులు జరగొచ్చు. దీంతో శాశ్వత పన్ను బయటకు రావాల్సిన స్థలం తగ్గిపోవచ్చు. ఫలితంగా శాశ్వత పన్ను వంకరగా లేదా సరైన స్థానంలో కాకుండా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు పెద్దయ్యాక పళ్లను సరిచేసేందుకు ఆర్థోడాంటిక్ చికిత్స అవసరం కావచ్చు.
పాల పన్ను ముందుగానే ఊడిపోయిందని ప్రతి పిల్లాడికీ తప్పనిసరిగా స్పేస్ మెయింటెయినర్ పెట్టాల్సిన అవసరం ఉండదు. పిల్లల వయసు, ఏ పాల పన్ను ముందుగా ఊడింది, ఆ స్థానంలోకి రావాల్సిన శాశ్వత పన్ను ఎంతవరకు అభివృద్ధి చెందింది వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతే పాల పన్ను, శాశ్వత పన్ను మధ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఎక్స్‌రే కూడా చేయవచ్చు. పరీక్షలు, ఎక్స్‌రే రిపోర్టును పరిశీలించిన తర్వాత శాశ్వత పన్నుకు స్థలం కాపాడేందుకు స్పేస్ మెయింటెయినర్ అవసరమా లేదా అనేది డెంటిస్ట్ నిర్ణయిస్తారు.
దెబ్బ తగిలి పాల పన్ను ఊడిపోతే ఏం చేయాలి?
పిల్లలు పడిపోవడం లేదా ఏదైనా ప్రమాదంలో దెబ్బ తగలడం వల్ల పాల పన్ను విరిగినా, ఊడిపోయినా వీలైనంత త్వరగా డెంటిస్ట్‌ను సంప్రదించాలి. ఊడిపోయిన పాల పన్నును తల్లిదండ్రులు స్వయంగా మళ్లీ చిగుళ్లలో పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఊడిన పన్నును శుభ్రమైన వస్త్రంలో ఉంచి వైద్యుడికి చూపించవచ్చు. దంత పరీక్షలో పన్నుతో పాటు చిగుళ్లు, పెదవులు, పక్కనున్న పళ్లు, నోటి లోపలి భాగంలో ఏమైనా గాయం అయిందా అనేది కూడా పరిశీలిస్తారు.
చికిత్స తర్వాత కూడా పిల్లలు గాయమైన ప్రాంతాన్ని పదే పదే వేలితో తాకకుండా జాగ్రత్తపడాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరగవచ్చు. నొప్పి, వాపు లేదా ఇతర ఇబ్బందులు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పాల పన్ను సమయానికి ముందే ఊడిపోయినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దంత వైద్యుడికి చూపించడం ముఖ్యం. సరైన సమయంలో పరీక్ష చేయిస్తే శాశ్వత పళ్లు వచ్చే సమయంలో అవసరమైన స్థలాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

