Last Updated:
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌లకు జామ్‌నగర్‌లో స్వాగతం పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఉన్న జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ సముదాయాన్ని వారు సందర్శించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌లకు జామ్‌నగర్‌లో స్వాగతం పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఉన్న జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ సముదాయాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా రిఫైనరీ విస్తీర్ణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమీకృత కార్యకలాపాలను అమెరికా ప్రతినిధులకు వివరించారు.
అనంతరం రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న న్యూ ఎనర్జీ గిగాఫ్యాక్టరీలను కూడా వారికి పరిచయం చేశారు. ఈ ప్లాంట్లను దశలవారీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్ల గురించి వివరించారు. ఇంధన రంగంతో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాల్లో రిలయన్స్ చేస్తున్న పెట్టుబడులు, అధునాతన తయారీ, డీప్‌టెక్ రంగాల్లో సంస్థకు ఉన్న సామర్థ్యాలను ఈ పర్యటన ద్వారా వివరించారు.
జామ్‌నగర్‌ను డీప్‌టెక్, ఆవిష్కరణలు, అధునాతన తయారీకి కీలక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న రిలయన్స్ దీర్ఘకాలిక ప్రణాళికను ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ అమెరికా ప్రతినిధులకు వివరించారు. అనంతరం ప్రపంచ ఇంధన రంగంలో నెలకొన్న పరిస్థితులు, సంప్రదాయ ఇంధన వనరులు, నూతన ఇంధన రంగాల్లో వాణిజ్య భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
ఇంధన భద్రత, సాంకేతికతపై చర్చలు
ప్రజలకు నమ్మకమైన, సరసమైన ధరలకు ఇంధనాన్ని అందించడం, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు, సరఫరా వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయడం, పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు అవసరమైన పెట్టుబడులు వంటి అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.
ఇంధన రంగం, డిజిటల్ మౌలిక సదుపాయాల మధ్య పెరుగుతున్న అనుసంధానంపైనా ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. ముఖ్యంగా డేటా సెంటర్ల నిర్వహణకు నిరంతర విద్యుత్ సరఫరా అవసరం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణలో ఇంధన రంగం పోషించే పాత్రపై చర్చించారు.
అమెరికా కంపెనీలతో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాంకేతికత, ఇంజినీరింగ్, అధునాతన తయారీ రంగాల్లో భారత్, అమెరికా సంస్థలకు ఉన్న పరస్పర అనుకూల సామర్థ్యాలను ఉపయోగించుకుని వాణిజ్య భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవచ్చని చర్చించారు.
ఈ సమావేశం ద్వారా పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు, పరస్పర వాణిజ్య ప్రయోజనాలు కలిగించే రంగాల్లో సహకార అవకాశాలను అన్వేషించినట్లు రిలయన్స్ వెల్లడించింది. తమ ఆహ్వానాన్ని మన్నించి జామ్‌నగర్‌ను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌లకు రిలయన్స్ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.

