Last Updated:
Tummadihatti Barrage: ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య నేడు అత్యున్నత స్థాయి చర్చలు జరగనున్నాయి.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని సహ్యాద్రి అతిథి గృహంలో ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు నిర్ధారణ, ముంపు నివారణ, నీటి లభ్యత అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లోతుగా చర్చించనున్నారు. ఈ కీలక సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం ఇంజినీర్ల ఉన్నత స్థాయి బృందం ఆదివారం రాత్రే ముంబయి చేరుకుంది.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఎత్తును ఎంతమేర ఉంచాలనే అంశంపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పక్కా సాంకేతిక డేటాతో సమగ్ర నివేదికను రూపొందించారు.
148 మీటర్ల ప్రతిపాదన: గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తుకు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ఆ ఎత్తు వద్ద తెలంగాణకు అవసరమైన పూర్తిస్థాయి నీటిని ఒడిసిపట్టడం, కాలువలకు తరలించడం క్షేత్రస్థాయిలో కష్టసాధ్యమని ఇంజినీరింగ్ వర్గాలు గుర్తించాయి.
152 మీటర్ల ప్రతిపాదన: ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలంటే బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించాలన్నది తెలంగాణ ప్రధాన ప్రతిపాదన. ఒకవేళ 152 మీటర్ల వద్ద నిర్మిస్తే ముంపు తీవ్రత ఎంత ఉంటుంది, నదీ గర్భంలో మునిగే విస్తీర్ణం ఎంత, నదికి ఇరువైపులా ఉన్న భూముల పరిస్థితి ఏమిటి అనే అంశాలను స్పష్టంగా విశ్లేషించారు.
కాంటూర్ మ్యాప్‌లు: నీటి మట్టాలకు సంబంధించిన అత్యాధునిక కాంటూర్ మ్యాప్‌లు, శాస్త్రీయ అధ్యయనాల ఫలితాలను ఫడణవీస్ ముందు ఉంచి, గ్రామాలపై పెద్దగా ముంపు ప్రభావం లేకుండా ప్రాజెక్టును ఎలా పూర్తి చేయవచ్చో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నిరూపించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలోని సాగునీటి కొరతను శాశ్వతంగా తీర్చడంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రాధాన్యం చాలా ఎక్కువ. ప్రాణహిత నది ద్వారా వర్షాకాలంలో వృథాగా సముద్రంలోకి పోయే వేల టీఎంసీల వరద జలాలను ఒడిసిపట్టి, బీడు భూములకు మళ్లించాలన్నది తెలంగాణ ప్రభుత్వ దృఢ సంకల్పం. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా, అక్కడి పర్యావరణ జోన్లు దెబ్బతినకుండా ఉండేలా ఒప్పించడమే లక్ష్యంగా తెలంగాణ బృందం వ్యూహరచన చేసింది.
ఒకవేళ 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైతే, ప్రత్యామ్నాయంగా కనీసం 150 మీటర్ల స్థాయికైనా పరస్పర అంగీకారానికి రావాలన్న ప్లాన్‌ను కూడా అధికారులు సిద్ధం చేసుకున్నారు. చాలా ఏళ్లుగా నలుగుతున్న ఈ అంతర్రాష్ట్ర జల సమస్యపై ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖాముఖి భేటీ కానుండటంతో, ఈ సమావేశం సానుకూల ఫలితాలనిస్తుందని ఉత్తర తెలంగాణ రైతాంగం గంపెడాశతో ఎదురుచూస్తోంది.
తుమ్మిడిహెట్టి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం కోసం మహారాష్ట్రకు సీఎం రేవంత్..తుమ్మిడిహెట్టిపై సీఎం ఫడ్నవీస్ తో చర్చలు వీడియోను చూడవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఎత్తు, మహారాష్ట్ర పర్యటనపై ఈ వీడియోలో తాజా విశేషాలు పొందుపరిచారు.

