Last Updated:
Saudi Arabia: యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణి దాడులను ముమ్మరం చేయడంతో సౌదీ యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ రక్షణ చర్యలను అత్యున్నత స్థాయికి పెంచారు.
ప్రత్యేక బంకర్లు, కట్టుదిట్టమైన భద్రత కలిగిన రాజభవనాల మధ్య ఆయన తన నివాసాన్ని తరచూ మార్చుకుంటున్నారని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ (WSJ) ప్రచురించిన తాజా కథనం వెల్లడించింది. జాతీయ రక్తదాన కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేసిన అనంతరం, గత మంగళవారం నుంచి 41 ఏళ్ల యువరాజు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆయన కదలికల గురించి తెలిసిన ఉన్నతాధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన కమాండోల భద్రత నడుమ, భారీ రక్షణ ఏర్పాట్లు ఉన్న వేర్వేరు రాజభవనాలకు ఆయనను తరలిస్తున్నారు. విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలే లక్ష్యంగా హుతీ తిరుగుబాటుదారులు దాడులను ఉధృతం చేయడమే ఈ ముందస్తు భద్రతా చర్యలకు కారణంగా తెలుస్తోంది.
హుతీల నియంత్రణలో ఉన్న యెమెన్ భూభాగానికి వందల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, సౌదీ రాజధాని రియాద్‌పై పదేపదే క్షిపణి దాడులు జరుగుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. గత గురువారం గాల్లోనే అడ్డుకున్న ఒక బాలిస్టిక్ క్షిపణి శకలాలు కిండర్‌గార్టెన్ పాఠశాల, ఒక వైద్య క్లినిక్ కాంప్లెక్స్‌పై పడ్డాయి. ఈ పరిస్థితుల్లో రాజభవనాలు, వ్యూహాత్మక ఇంధన కేంద్రాల రక్షణ కోసం దేశవ్యాప్తంగా వాయు రక్షణ వ్యవస్థలను (Air Defence Systems) సౌదీ అరేబియా మోహరిస్తోంది. అయితే భవిష్యత్ దాడులను అడ్డుకోవడానికి అవసరమైన క్షిపణి ఇంటర్సెప్టర్ల నిల్వలు తగ్గిపోతున్నాయని సౌదీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం ముడిచమురుపైనే ఆధారపడకుండా సౌదీ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యభరితంగా తీర్చిదిద్దాలని యువరాజు ఎంబీఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘విజన్ 2030’ ప్రాజెక్టులకు ఈ దాడులు పెను సవాలుగా మారాయి. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లకుండా నేరుగా ముడిచమురును ఎగుమతి చేసే అత్యంత కీలకమైన ‘ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్’తో పాటు రిఫైనరీలు, విమానాశ్రయాలను హుతీలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు సౌదీ పర్యాటక రంగం, భారీ విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఈ ముప్పును ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌తో పాటు ఇతర మిత్రదేశాల నుంచి రియాద్ అదనపు సైనిక సాయాన్ని కోరుతోంది. దౌత్యపరమైన మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, అమెరికా కేవలం సైనిక సలహాదారులను మాత్రమే పంపిందని, హుతీల పురోగతిని పూర్తిగా తిప్పికొట్టే విషయంలో ప్రత్యక్ష సహాయాన్ని అందించడానికి ఇంకా ముందుకు రాలేదని సమాచారం.

