న్యూస్18 హిందీ వెల్లడించిన కథనం ప్రకారం.. Galaxy Z Fold 8 Ultraతో పాటు Galaxy Z Fold 8, Galaxy Z Flip 8, కొత్త Galaxy AI ఫీచర్లు, అలాగే ఇతర స్మార్ట్ డివైజ్‌లను కూడా Samsung ఈ వేదికపై ఆవిష్కరించే అవకాశం ఉంది. కొత్త హార్డ్‌వేర్‌తో పాటు AI ఆధారిత సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా కంపెనీ అడుగులు వేస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈసారి Galaxy Unpacked ఈవెంట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Samsung Galaxy Unpacked 2026 ఈవెంట్ జూలై 22న లండన్‌లో నిర్వహించబడనుంది. భారత కాలమానం (IST) ప్రకారం ఈ కార్యక్రమం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న Samsung అభిమానులు ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అవకాశం కల్పించింది కంపెనీ. ఈ కార్యక్రమాన్ని Samsung Newsroom India వెబ్‌సైట్, Samsung India అధికారిక వెబ్‌సైట్, అలాగే Samsung అధికారిక YouTube ఛానెల్‌లో లైవ్‌గా వీక్షించవచ్చు. ఈసారి Galaxy AI ఆధారిత మరింత తెలివైన ఫీచర్లతో కొత్త పరికరాలు రానున్నాయని Samsung ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.
ఈ ఈవెంట్‌లో అత్యంత ఎక్కువగా చర్చనీయాంశమైన డివైస్ Galaxy Z Fold 8 Ultra. ఇది నిజంగానే విడుదలైతే Samsung నుంచి ‘Ultra’ బ్రాండ్‌తో వచ్చిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది. అత్యాధునిక హార్డ్‌వేర్, మెరుగైన కెమెరా వ్యవస్థ, పెద్ద డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పే అవకాశముందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. లీక్ అయిన సమాచారం ప్రకారం Galaxy Z Fold 8 Ultraలో 6.3 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 8 అంగుళాల ఫోల్డబుల్ AMOLED స్క్రీన్, Snapdragon 8 Gen 5 Elite for Galaxy ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్), అలాగే రెండు స్క్రీన్‌లపై 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉండే అవకాశం ఉంది.
Galaxy Z Fold 8 కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించబడే అవకాశం ఉంది. Ultra మోడల్‌తో పోలిస్తే దీని డిజైన్ కొంత వెడల్పుగా, తక్కువ ఎత్తుతో ఉండవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. ప్రీమియం ఫోల్డబుల్ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ ఫోన్‌లో 5.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 7.6 అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్, 50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 10MP సెల్ఫీ కెమెరా, సుమారు 4,800mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందించే సామర్థ్యం కూడా ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ మోడల్‌కు మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంటుందని అంచనా వేసిన Samsung, భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Galaxy Z Flip 8లో గత మోడల్‌తో పోలిస్తే పెద్దగా డిజైన్ మార్పులు కనిపించకపోవచ్చని లీక్‌లు చెబుతున్నాయి. అయితే డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వంటి అంశాల్లో కొన్ని మెరుగుదలలు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 4.1 అంగుళాల కవర్ స్క్రీన్, 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP ఫ్రంట్ కెమెరా, 4,300mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Samsung ఇప్పటివరకు భారత మార్కెట్‌కు సంబంధించిన అధికారిక ధరలను ప్రకటించలేదు. అయితే యూరప్ మార్కెట్‌కు సంబంధించిన లీక్ అయిన వివరాల ఆధారంగా భారత ధరలపై అంచనాలు వెలువడుతున్నాయి. Galaxy Z Flip 8 (256GB) ధర సుమారు రూ.1.48 లక్షలు, 512GB వేరియంట్ ధర రూ.1.71 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. Galaxy Z Fold 8 (256GB) ధర రూ.2.28 లక్షలు, 512GB మోడల్ రూ.2.50 లక్షలు, 1TB వేరియంట్ రూ.2.94 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. అదే విధంగా Galaxy Z Fold 8 Ultra (256GB) ధర సుమారు రూ.2.50 లక్షలు, 512GB మోడల్ రూ.2.72 లక్షలు, 1TB వేరియంట్ ధర రూ.3.16 లక్షల వరకు ఉండవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే ఇవన్నీ యూరప్ మార్కెట్‌కు సంబంధించిన లీక్ వివరాల ఆధారంగా వచ్చిన అంచనాలు మాత్రమే. భారత మార్కెట్‌లో తుది ధరలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది.
