Last Updated:
పనీర్ కర్రీతో పోలిస్తే ఇందులో ఉపయోగించే దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనైస్ వంటి మసాలాలు మంచి సువాసనను ఇస్తాయి. ఇంట్లోనే రెస్టారెంట్ తరహా రుచిని ఆస్వాదించాలనుకునేవారు ఈ కర్రీని సులభంగా తయారుచేసుకోవచ్చు. వేడి అన్నం, జీరా రైస్, చపాతీ, రోటీ, పుల్కా, నాన్ లేదా బిర్యానీతో కూడా దీనిని సర్వ్ చేయవచ్చు.
హైదరాబాది స్టైల్ పనీర్ కర్రీ అంటేనే ఘుమఘుమలాడే మసాలాలు, క్రీమీ గ్రేవీ, మెత్తగా ఉండే పనీర్ గుర్తొస్తాయి. సాధారణ పనీర్ కర్రీతో పోలిస్తే ఇందులో ఉపయోగించే దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనైస్ వంటి మసాలాలు మంచి సువాసనను ఇస్తాయి. ఇంట్లోనే రెస్టారెంట్ తరహా రుచిని ఆస్వాదించాలనుకునేవారు ఈ కర్రీని సులభంగా తయారుచేసుకోవచ్చు. వేడి అన్నం, జీరా రైస్, చపాతీ, రోటీ, పుల్కా, నాన్ లేదా బిర్యానీతో కూడా దీనిని సర్వ్ చేయవచ్చు.
ముందుగా 200 గ్రాముల పనీర్‌ను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పనీర్ చాలా గట్టిగా ఉంటే కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో ఉంచితే మెత్తగా మారుతుంది. తర్వాత కర్రీకి అవసరమైన మసాలా పేస్ట్‌ను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనైస్, జాపత్రి, బిర్యానీ ఆకు వేసి కొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, బాదం, జీడిపప్పు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, అవసరమైతే కొద్దిగా క్యారెట్ వేసి బాగా కలపాలి. టమాటా, ఉల్లిపాయ మెత్తగా అయ్యే వరకు మీడియం మంటపై ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. గ్రేవీ స్మూత్‌గా రావాలంటే మసాలా పేస్ట్‌ను బాగా మెత్తగా గ్రైండ్ చేయడం ముఖ్యం.
తర్వాత అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి అర టీస్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత తయారు చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేసి తక్కువ మంటపై కలుపుతూ ఉడికించాలి. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు పాన్‌కు అంటుకోకుండా అవసరమైతే కొద్దిగా నీళ్లు కలపాలి. గ్రేవీ నుంచి మంచి సువాసన వచ్చి నూనె కొద్దిగా పైకి కనిపించే వరకు ఉడికిస్తే రుచి మరింత బాగా వస్తుంది.
ఇప్పుడు ముందుగా ఉడికించిన బఠానీలు వేసి కలపాలి. బాగా చిలికిన పెరుగును కొద్దికొద్దిగా వేసి తక్కువ మంటపై నిరంతరం కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పెరుగు ముద్దలు కట్టకుండా గ్రేవీలో బాగా కలిసిపోతుంది. పెరుగు బదులుగా ఫ్రెష్ క్రీమ్ ఉపయోగిస్తే గ్రేవీ మరింత క్రీమీగా ఉంటుంది. తర్వాత సుమారు అర కప్పు నీళ్లు పోసి మూత పెట్టి కొన్ని నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.
చివరగా పనీర్ ముక్కలను గ్రేవీలో వేసి జాగ్రత్తగా కలపాలి. పనీర్ ముక్కలు విరిగిపోకుండా గరిటతో ఎక్కువగా కలపకండి. మూత పెట్టి మరో మూడు నాలుగు నిమిషాలు మాత్రమే ఉడికిస్తే పనీర్ మసాలా రుచిని బాగా పీల్చుకుంటుంది. పనీర్‌ను ఎక్కువసేపు ఉడికిస్తే గట్టిగా మారే అవకాశం ఉంటుంది.
చివర్లో చేతులతో నలిపిన కసూరి మేతీ, తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. గ్రేవీ మరీ చిక్కగా ఉంటే కొద్దిగా వేడి నీళ్లు కలిపి కావాల్సిన స్థాయికి తీసుకురావచ్చు. అంతే.. ఘుమఘుమలాడే హైదరాబాది స్టైల్ పనీర్ కర్రీ సిద్ధం. వేడివేడిగా అన్నం, చపాతీ, రోటీ, నాన్ లేదా జీరా రైస్‌తో సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది.

