Last Updated:
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా వచ్చిన కొత్త సినిమా ‘నా వైఫ్ మిస్సింగ్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ కథ ఎలా ఉంది? ఆడియన్స్ ని మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన క్యూట్ పెయిర్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్.. సుమారు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జతకట్టి చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్’. అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. శ్వేతా బసు ప్రసాద్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు ప్రాజెక్ట్‌తో రీఎంట్రీ ఇవ్వడం, అలాగే వరుణ్ సందేశ్ తన రెగ్యులర్ లవర్ బాయ్ ఇమేజ్ను పక్కనపెట్టి ఒక భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథను ఎంచుకోవడంతో ఈ ఓటీటీ రిలీజ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై శివ కంఠంనేని నిర్మించిన ఈ చిత్రానికి స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు.
కథ: బాలు (వరుణ్ సందేశ్) ఒక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఒకరోజు తన భార్య స్వప్న (శ్వేతా బసు ప్రసాద్) కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఇక్కడి నుంచి కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చూపుల్లోనే స్వప్న తన గతం గురించి చెబుతూ, తాను వర్జిన్ కాదన్న విషయాన్ని బాలుకు స్పష్టం చేస్తుంది. ఆమె నిజాయితీ నచ్చి బాలు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే, పెళ్లి తర్వాత తన ప్రియుడు అబాన్ (మోహిత్ పెద్దాడ) వద్దకు వెళ్లిపోతానని స్వప్న చెప్పగా, బాలు దానికి కూడా సైలెంట్‌గా అంగీకరిస్తాడు. కానీ అనూహ్యంగా ఆమె అదృశ్యం కావడంతో బాలు పైనే పోలీసులకు అనుమానం వస్తుంది. మరోవైపు తాను కూడా స్వప్నను కలవలేదని అబాన్ చెప్పడంతో మిస్టరీ మరింత ముదురుతుంది. అసలు స్వప్న ఏమైంది? ఎక్కడికి వెళ్లింది? అన్నదే ఈ సినిమా కథ.
సమాజంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న వివాహేతర సంబంధాలు, గతం తాలూకు ప్రేమల వల్ల పచ్చని కాపురాల్లో జరిగే అనర్థాల నేపథ్యంలో ఈ కథను దర్శకురాలు స్వాతిప్రకాష్ చాలా ఉత్కంఠభరితంగా మలిచారు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినప్పటికీ, ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని పెంచుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా పలు సన్నివేశాలు తీర్చిదిద్దారు.
నటీనటుల విషయానికొస్తే.. ఇంటెన్స్, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో వరుణ్ సందేశ్ నటన ఆకట్టుకుంటుంది. శ్వేతా బసు ప్రసాద్ తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. కీలకమైన పోలీసుల పాత్రల్లో నటుడు ప్రవీణ్, జబర్దస్త్ సత్యశ్రీ మెప్పించారు. సాంకేతికంగా సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కాగా, ఎన్.ఎస్. సతీష్ కుమార్ సినిమాటోగ్రఫీ విజువల్స్ సినిమా స్థాయిని పెంచాయి. క్రైమ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘నా వైఫ్ మిస్సింగ్’ ఒక మంచి ఆప్షన్.

