Last Updated:
ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్న విద్యార్థులకు కీలక సమాచారం. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో ప్రవేశాలకు ఉపయోగపడే జేఈఈ మెయిన్ 2027 మొదటి విడత దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2027 మొదటి విడత పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. ఈసారి దరఖాస్తుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గుర్తింపు ధ్రువీకరణ, ప్రత్యక్ష ఫొటో నమోదు వంటి మార్పులను తీసుకొచ్చారు.
జేఈఈ మెయిన్ 2027 మొదటి విడతకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2026 నవంబర్ 22. ఈ గడువులో దరఖాస్తు చేయలేని విద్యార్థులు నవంబర్ 23 నుంచి 26 వరకు రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొదటి విడత పరీక్షలు 2027 జనవరి 20, 21, 22, 23, 24, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్ష రెండు విడతల సమయంలో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. రెండో విడతకు 2027 జనవరి 5 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విడత పరీక్షలు ఏప్రిల్ 2, 3, 4, 5, 6, 7 తేదీల్లో జరగనున్నాయి.
జేఈఈ మెయిన్ 2027కు దరఖాస్తు చేయడానికి నిర్దిష్ట వయోపరిమితి లేదు. 2025 లేదా 2026లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనవారు, 2027లో పరీక్ష రాయనున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీ లేదా టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని చదివి ఉండాలి. ఫీజు విషయానికి వస్తే సాధారణ కేటగిరీ పురుషులకు ఒక్కో పేపర్‌కు రూ.1,000గా ఉంది. సాధారణ కేటగిరీ మహిళలు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800 నుంచి రూ.900 మధ్య, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఒక్కో పేపర్‌కు రూ.500గా పేర్కొన్నారు.
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను తెరిచి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. మేరీ పెహచాన్, జనపరిచయ్, డిజిలాకర్ లేదా ఆధార్ వంటి మార్గాల ద్వారా గుర్తింపును ధ్రువీకరించవచ్చు. అనంతరం పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకుంటే అప్లికేషన్ నంబర్ వస్తుంది. ఈ నంబర్‌ను భద్రపరచుకోవాలి. రెండు విడతల దరఖాస్తులకు ఇదే ఉపయోగపడుతుంది. తర్వాత వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి. ఫారమ్ నింపే సమయంలో వెబ్‌క్యామ్ లేదా మొబైల్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రత్యక్ష ఫొటోను నమోదు చేయడం తప్పనిసరి. చివరగా వచ్చే నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి భద్రపరచాలి. అలాగే విద్యార్థులు తమ లేదా తల్లిదండ్రుల చెల్లుబాటయ్యే మొబైల్ నంబర్, ఈమెయిల్ చిరునామానే నమోదు చేయాలి. పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వీటి ద్వారానే పంపిస్తుంది.

