Last Updated:
జ్వరం రాగానే కరోనా అని వణికి పోతున్నారా? లేదంటే డెంగీ అని భయపడుతున్నారా? అయితే డాకర్ట్ చెప్పిన ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా ప్రతి ఇంటా జ్వర పీడితులు కనిపిస్తున్నారు. జ్వరం రాగానే అది డెంగీ లేక కరోనా ఏమో అని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిన్నపాటి జలుబు చేసినా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అయితే సాధారణ జ్వరాలకు, డెంగీ, కరోనా వైరస్‌లకు ఎలాంటి సంబంధం ఉండదని సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ డాక్టర్ శ్యామల స్పష్టం చేశారు. ప్రస్తుతం కాలం మారుతున్న నేపథ్యంలో సాధారణ జ్వరాలు రావడం సహజమేనని, జ్వరం రాగానే ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. వాతావరణ మార్పులను అర్థం చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, అనవసరమైన భయం వద్దని సూచించారు.
ప్రధానంగా డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలడానికి మన చుట్టూ ఉండే అపరిశుభ్రతే కారణమని డాక్టర్ శ్యామల సవివరంగా తెలిపారు. ముఖ్యంగా పగటిపూట కుట్టే దోమల వృద్ధి కారణంగానే ఈ విషజ్వరాలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయని వివరించారు. ఇంటి పరిసరాల్లో పనికిరాని వస్తువులు పడేయడం మానుకోవాలన్నారు. ముఖ్యంగా కొబ్బరి చిప్పలు, పగిలిన కుండలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో వర్షపు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్లే దోమలు భారీగా వృద్ధి చెందుతున్నాయని ఆమె హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ రోగాలను సులభంగా మన దరికి రాకుండా తరిమికొట్టవచ్చని సూచించారు. ఇళ్ల చుట్టూ నీరు నిలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
సాధారణ జలుబు, దగ్గు, జ్వరం అనేవి ప్రస్తుతం కామన్‌గా అందరికీ వస్తున్నాయని, వాటిని వెంటనే కరోనా లేదా విషజ్వరాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని డాక్టర్ శ్యామల క్లారిటీ ఇచ్చారు. డెంగీ ఫీవర్‌ను సులభంగా గుర్తించేందుకు ఆమె రెండు కీలక ఉదాహరణలు ప్రజల ముందు ఉంచారు. దేహంపై ఎర్రని మచ్చలు ఏర్పడి అవి క్రమంగా పెరగడం, పళ్ల చిగుళ్ల నుంచి చిన్న చిన్న రక్తపు చుక్కలు బయటకు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకూడదన్నారు. ఇలాంటి పరిణామాలు డెంగీకి సంకేతాలని, వెంటనే డెంగీ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని స్పష్టం చేశారు. డెంగీ బారిన పడితే శరీరంలో ప్లేట్లెట్స్ వేగంగా పడిపోతాయని, వెంటనే ఆసుపత్రికి వెళ్తే మెరుగైన వైద్యం అందించి ప్లేట్లెట్స్ పెరిగేలా చూస్తామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడతామని భరోసా కల్పించారు.
రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలని డాక్టర్ శ్యామల వెల్లడించారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం ద్వారా గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని సూచించారు. రోజూ ఉదయం కనీసం గంటపాటు యోగా, వాకింగ్, చిన్నపాటి రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలని చెప్పారు. ఇలా చేయడం ద్వారా శరీరం ఎంతో ఉత్సాహంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరిగి ఎటువంటి వ్యాధులు మన దరికి రాకుండా ఉంటాయని ఆమె వివరించారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాకినాడ తర్వాత అంతటి పెద్ద ఆసుపత్రి అయిన తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా అనుమానితుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారి కోసం ప్రత్యేక వార్డులను సైతం సిద్ధంగా ఉంచినట్లు కాకినాడ జిల్లా డీసీహెచ్ఎస్, తుని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ వెల్లడించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా భయపడకుండా వెంటనే ఆసుపత్రిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Hyderabad,Telangana
