Last Updated:
GST: భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందంజలో పయనిస్తూ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది.
దేశీయ లావాదేవీలు, దిగుమతుల నుండి రాబడి పెరగడంతో 2026 జూలై నెలకు గాను మొత్తం (Gross) జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 15.4 శాతం పెరిగి, ఏకంగా రూ. 2.11 లక్షల కోట్ల మార్కును దాటాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది (జూలై 2025) జీఎస్టీ వసూళ్లు రూ. 1.83 లక్షల కోట్లుగా నమోదు కాగా, ఈ జూన్ (2026)లో రూ. 1.95 లక్షల కోట్లు సాధించింది. జూలై వసూళ్లతో వరుసగా రెండో నెలలో కూడా రూ. 2 లక్షల కోట్ల కంటే ఎక్కువ రాబడి రావడం విశేషం.
జూలై నెలలో వసూలైన మొత్తం జీఎస్టీ ఖజానా వివరాలు ఇలా ఉన్నాయి
సెంట్రల్ జీఎస్టీ (CGST): రూ. 39,835 కోట్లు
స్టేట్ జీఎస్టీ (SGST): రూ. 47,881 కోట్లు
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST): రూ. 1.23 లక్షల కోట్లకు పైగా (అంతర్రాష్ట్ర లావాదేవీలు, దిగుమతుల ద్వారా లభించింది)
ప్రభుత్వం వ్యాపారులకు ఇచ్చే రీఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసింది. జూలై నెలలో మొత్తం జీఎస్టీ రీఫండ్లు 13.1 శాతం పెరిగి రూ. 29,968 కోట్లకు చేరాయి. ఈ రీఫండ్లను మినహాయించిన తర్వాత, నికర (Net) జీఎస్టీ రాబడి రూ. 1.81 లక్షల కోట్లకు పైగా నమోదైంది. రీఫండ్ల రూపంలో చెల్లింపులు పెరిగినప్పటికీ, నికర ఆదాయంలో పెరుగుదల నమోదవడం పరోక్ష పన్నుల పునాది బలంగా ఉందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ గణాంకాలపై కేపీఎమ్జీ (KPMG) ఇండైరెక్ట్ టాక్స్ హెడ్ & పార్టనర్ అభిషేక్ జైన్ స్పందిస్తూ.. “జూలై జీఎస్టీ వసూళ్లు చాలా ఆశాజనకంగా ఉన్నాయన్నారు. దిగుమతుల ద్వారా ఎక్కువ వృద్ధి నమోదైంది. అయితే ఇది ఫినిష్డ్ గూడ్స్ వల్లా లేక రా మెటీరియల్స్ వల్లా, మరియు రూపాయి విలువ క్షీణించడం ఎంతవరకు ప్రభావం చూపిందనేది పరిశీలించాల్సి ఉందన్నారు. దేశీయ వసూళ్లు కూడా స్థిరంగా పెరుగుతున్నాయి. రీఫండ్లు పెరిగినప్పటికీ ఆర్థిక వెసులుబాటు ఉన్న నేపథ్యంలో, ‘జీఎస్టీ 3.0’ సంస్కరణల దిశగా ఆలోచించడానికి ఇది సరైన సమయం” అని ఆయన అభిప్రాయపడ్డారు.
గత నెల (జూన్ 2026)లో మొత్తం జీఎస్టీ వసూళ్లు 13.9 శాతం వృద్ధితో రూ. 1,94,812 కోట్లుగా (జూన్ 2025 లో రూ. 1,71,105 కోట్లు) నమోదయ్యాయి. జూన్ నెలలో దిగుమతుల ద్వారా పన్ను రాబడి ఏకంగా 34.6 శాతం పెరిగి రూ. 60,038 కోట్లకు చేరగా, దేశీయ లావాదేవీల ద్వారా 6.5 శాతం వృద్ధితో రూ. 1,34,774 కోట్లు వసూలయ్యాయి. జూన్లో రీఫండ్లు 29.1 శాతం పెరిగి రూ. 32,436 కోట్లకు చేరుకుని వ్యాపారాలకు నగదు లభ్యతను పెంపొందించాయి.
Hyderabad,Telangana

