Last Updated:
గోధుమ రవ్వలో పీచు పదార్థం ఉంటుంది. పెసరపప్పులో ప్రోటీన్ లభిస్తుంది. వీటికి క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు జోడిస్తే కూరగాయల నుంచి కూడా పోషకాలు అందుతాయి. తక్కువ మసాలాలతో తయారయ్యే ఈ కిచిడీని టిఫిన్‌గా లేదా మధ్యాహ్న భోజనంగా తీసుకోవచ్చు.
రోజూ అన్నం, టిఫిన్లు తిని బోర్ కొడుతోందా? అయితే గోధుమ రవ్వతో కమ్మని కిచిడీని తయారు చేసుకుని చూడండి. సాధారణంగా కిచిడీని బియ్యం, పప్పుతో చేస్తుంటారు. కానీ బియ్యానికి బదులుగా గోధుమ రవ్వ, పొట్టు పెసరపప్పు ఉపయోగిస్తే రుచితో పాటు మంచి పోషకాలు కూడా అందుతాయి. గోధుమ రవ్వలో పీచు పదార్థం ఉంటుంది. పెసరపప్పులో ప్రోటీన్ లభిస్తుంది. వీటికి క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు జోడిస్తే కూరగాయల నుంచి కూడా పోషకాలు అందుతాయి. తక్కువ మసాలాలతో తయారయ్యే ఈ కిచిడీని అల్పాహారంగా లేదా మధ్యాహ్న భోజనంగా తీసుకోవచ్చు.
ఈ కిచిడీ తయారు చేయడానికి ఒక గ్లాసు గోధుమ రవ్వ, ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు, ఐదు నుంచి ఆరు గ్లాసుల నీళ్లు, పావు కప్పు సన్నగా తరిగిన బీన్స్, పావు కప్పు క్యారెట్ ముక్కలు, ఒక పిడికెడు పచ్చి బఠానీలు తీసుకోవాలి. వీటితో పాటు అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఒక టీస్పూన్ నెయ్యి, ఒక టీస్పూన్ నూనె, కొద్దిగా కొత్తిమీర అవసరం.
ముందుగా పొట్టు పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం రెండు గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. గోధుమ రవ్వను కూడా కడిగి నీటిని పూర్తిగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్‌పై పెట్టి నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత పచ్చి బఠానీలు వేసి మరో నిమిషం వేయించాలి.
ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పును వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత గోధుమ రవ్వను కూడా వేసి ఒకటి రెండు నిమిషాలు కలుపుతూ వేయించాలి. ఇలా చేయడం వల్ల రవ్వకు నెయ్యి వాసన పట్టి కిచిడీ రుచి బాగుంటుంది. అనంతరం ఐదు నుంచి ఆరు గ్లాసుల నీళ్లు పోసి, ఉప్పు, మిరియాల పొడి, పసుపు వేసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై సుమారు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అయితే కుక్కర్, రవ్వ రకాన్ని బట్టి నీటి పరిమాణం, ఉడికే సమయం మారవచ్చు.
కుక్కర్‌లో ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాతే మూత తీయాలి. కిచిడీ మెత్తగా ఉడికిందో లేదో చూసి గరిటెతో కలపాలి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నీళ్లు కలిపి మరోసారి ఉడికించుకోవచ్చు. చివరగా కొత్తిమీర చల్లి వేడివేడిగా వడ్డించాలి. పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. టమాటా పప్పుచారు, పెరుగు, పచ్చడి లేదా పచ్చి ఉల్లిపాయతో కలిపి తినవచ్చు. రుచికరమైన ఈ గోధుమ రవ్వ కిచిడీని మీ ఇంట్లోనూ సులభంగా తయారు చేసుకోండి.
చిన్న చిట్కా: కిచిడీని మరింత మెత్తగా కావాలంటే నీటిని కొద్దిగా పెంచుకోవచ్చు. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారానికి అలవాటు లేనివారు చిన్న పరిమాణంతో ప్రారంభించి, తగినంత నీరు తాగడం మంచిది.

