Last Updated:
కొన్ని సినిమాలకు కాలంతో సంబంధం ఉండదు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. ముఖ్యంగా స్నేహితులతో కలిసి చూసినప్పుడు ఆ అనుభూతే వేరు.
కొన్ని సినిమాలకు కాలంతో సంబంధం ఉండదు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. ముఖ్యంగా స్నేహితులతో కలిసి చూసినప్పుడు ఆ అనుభూతే వేరు. అలాంటి సినిమాల జాబితాలో టాలీవుడ్ కల్ట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ ముందు వరుసలో ఉంటుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా యూత్‌కు ఎంతగా కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులోని కామెడీ, నలుగురు స్నేహితుల మధ్య సాగే సంభాషణలు, సహజమైన నటన ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటాయి. మూడ్ బాలేనప్పుడు ఈ సినిమా చూస్తే చాలు.. కాసేపు అన్ని బాధలు మర్చిపోయి నవ్వుకోవచ్చని చెప్పేవాళ్లు చాలామందే ఉన్నారు.
ఇప్పుడు ఈ కల్ట్ సినిమాకు సీక్వెల్ వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. ‘ఈ నగరానికి ఏమైంది 2’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాను నవంబర్ 19న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం. మొదటి భాగం సాధించిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సీక్వెల్‌ను కూడా ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి భాగంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమను, శ్రీనాథ్ మాగంటి తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ నలుగురి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు సీక్వెల్‌లోనూ వీరే నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈసారి వారి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి? ఎలాంటి కొత్త సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను నవ్విస్తారు? అనే ఆసక్తి నెలకొంది.
తరుణ్ భాస్కర్ సినిమాల్లో సహజమైన సంభాషణలు, స్నేహితుల మధ్య జరిగే సరదా గొడవలు, వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలోనూ కామెడీని ప్రత్యేకంగా ఇరికించినట్లు కాకుండా కథలో భాగంగా ముందుకు తీసుకెళ్లడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా విడుదలైన సమయంలో ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందకపోయినా, ఆ తర్వాత కల్ట్ మూవీగా మారింది.
ఇప్పుడు రెండో భాగంతోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బాబు, సృజన్ యారబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
మొత్తానికి ‘ఈ నగరానికి ఏమైంది 2’ నవంబర్ 19న విడుదల కానుండటంతో ఈ ఏడాది టాలీవుడ్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. మరి మొదటి భాగంలాగే సీక్వెల్ కూడా యూత్‌కు ఫేవరెట్‌గా మారుతుందా? నలుగురు స్నేహితుల కామెడీ మరోసారి థియేటర్లలో నవ్వులు పూయిస్తుందా? తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

