Last Updated:
డెల్ టెక్నాలజీస్ భారత్‌లో కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్ లైనప్‌ను విడుదల చేసింది. ఎక్స్పీఎస్ 13, డెల్ 14ఎస్, డెల్ 16ఎస్, ఏలియన్‌వేర్ 15 మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.
డెల్ టెక్నాలజీస్ భారత్‌లో తన కొత్త ప్రీమియం కన్జ్యూమర్ ల్యాప్‌టాప్ లైనప్‌ను విడుదల చేసింది. ఎక్స్పీఎస్ 13, డెల్ 14ఎస్, డెల్ 16ఎస్, ఏలియన్‌వేర్ 15 మోడళ్లతో వచ్చిన ఈ కొత్త శ్రేణి ద్వారా సన్నని డిజైన్, ఏఐ సామర్థ్యాలు, అధిక పనితీరు వంటి ఫీచర్లను మరింత మంది భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారత యువత, డిజిటల్ వినియోగదారులతో వేగంగా ఎదుగుతున్న ముఖ్యమైన మార్కెట్ అని డెల్ టెక్నాలజీస్ తెలిపింది. పని, చదువు, క్రియేటివ్ పనులు, గేమింగ్ అవసరాలకు సరిపోయేలా ఈ కొత్త ఉత్పత్తులను రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. డెల్ టెక్నాలజీస్ గ్లోబల్ కన్జ్యూమర్ అండ్ ఈకామర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ కౌగర్ మాట్లాడుతూ, ప్రతి వినియోగదారుడి అవసరాలకు, ప్రతి ధర స్థాయికి సరిపోయే టెక్నాలజీని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. భారత్‌లోని వినియోగదారులకు డెల్ ఆవిష్కరణలను మరింత విస్తృతంగా అందించేందుకు ఈ పోర్ట్‌ఫోలియో సహాయపడుతుందని చెప్పారు.
కొత్త ఎక్స్పీఎస్ 13 ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని, తేలికైన ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌గా కంపెనీ పేర్కొంది. 12.7 మిల్లీమీటర్ల సన్నని డిజైన్, 1 కిలో బరువు, 17 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఇందులో ఇంటెల్ కోర్ సిరీస్ 3 లేదా ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్లు, 32జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ మెమరీ ఉన్నాయి. 2.5కే ఎల్సీడీ ఇన్ఫినిటీ ఎడ్జ్ టచ్ డిస్ప్లే, 120హెచ్జడ్ వరకు రిఫ్రెష్ రేట్, వై-ఫై 7, డాల్బీ అట్మాస్ స్పీకర్లతో మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.
డెల్ 14ఎస్, డెల్ 16ఎస్ ల్యాప్‌టాప్‌లు రోజువారీ పని, వినోద అవసరాల కోసం రూపొందించారు. ఇవి ఇంటెల్ కోర్ అల్ట్రా లేదా ఏఎమ్‌డీ రైజెన్ ఏఐ 400 సిరీస్ ప్రాసెసర్లతో వస్తాయి. 50 టీఓపీఎస్ వరకు ఎన్పీయూ సామర్థ్యంతో ఏఐ ఆధారిత పనులను నిర్వహించగలవు. డెల్ 16ఎస్‌లోని ఇంటెల్ కోర్ అల్ట్రా ఎక్స్7 358హెచ్ ప్రాసెసర్ గత తరం కంటే 55 శాతం మెరుగైన గ్రాఫిక్స్ పనితీరును అందిస్తుంది.
గేమింగ్ ప్రియుల కోసం ఏలియన్‌వేర్ 15ను తీసుకొచ్చారు. ఇందులో ఇంటెల్ కోర్ 7 (సిరీస్ 2) 240హెచ్ ప్రాసెసర్లు, ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 5060 గ్రాఫిక్స్ వరకు ఎంపికలు ఉన్నాయి. 15.3 అంగుళాల డబ్ల్యూయూక్స్జీఏ డిస్ప్లే, 165హెచ్జడ్ రిఫ్రెష్ రేట్, మెరుగైన థర్మల్ టెక్నాలజీలతో గేమింగ్, స్ట్రీమింగ్కు అనుకూలంగా ఉంటుంది. డెల్ ఈ ఉత్పత్తులను డెల్స్టోర్.కామ్, డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, పెద్ద రిటైల్ స్టోర్స్, మల్టీ బ్రాండ్ అవుట్లెట్ల ద్వారా భారత్‌లో 400 నగరాల్లో అందుబాటులోకి తీసుకువస్తోంది.
ధరల విషయానికి వస్తే, ఎక్స్పీఎస్ 13 ప్రారంభ ధర రూ.79,990. డెల్ 14ఎస్ ధర రూ.1,19,990 నుంచి, డెల్ 16ఎస్ ధర రూ.2,29,990 నుంచి ప్రారంభమవుతుంది. ఏలియన్‌వేర్ 15 ప్రారంభ ధర రూ.1,28,990. ఎంపిక చేసిన ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త లైనప్ ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటర్లు, గేమర్లకు సరిపోయే ప్రీమియం కంప్యూటింగ్ అనుభవాన్ని అందించడమే డెల్ లక్ష్యంగా పెట్టుకుంది.
Hyderabad,Telangana

