Last Updated:
CM Yogi Adityanath: గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రూపురేఖలనే మార్చేసిందని, తాము చేసిన అభివృద్ధి, సుపరిపాలన ఆధారంగానే ప్రజల వద్దకు వెళ్లి మరోసారి తీర్పు కోరతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్న ‘న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్ – నార్త్ ఎడిషన్’ (News18 Rising Bharat Summit – North Edition) కార్యక్రమంలో నెట్వర్క్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ వరుసగా మూడోసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి సందేహం లేదని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. “గత తొమ్మిదేళ్లలో మేము యూపీ చిత్రపటాన్ని మార్చేశాము. గత తొమ్మిదిన్నరేళ్లుగా మేము చేసిన అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రజల వద్దకు వెళ్తాము” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బీజేపీతో పాటు తమ మిత్రపక్షాలు ఏ అంశాల ఆధారంగా ఓట్లు అడుగుతాయో కూడా ఆయన వివరించారు.
గత సమాజ్వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనపై యోగి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీల హయాంలో రాష్ట్రంలో సాగిన ‘జంగిల్ రాజ్’, ‘గూండా రాజ్’తో పాటు నాటి కర్ఫ్యూలు, మత ఘర్షణల అంశాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. ఇండియా కూటమి లేదా సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉండి ఉంటే.. నేడు యూపీలో బీజేపీ అందిస్తున్న తరహా సుపరిపాలన సాధ్యమయ్యేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని పేర్కొన్న యోగి ఆదిత్యనాథ్, దేశంలో నిజమైన ప్రజాస్వామ్య సంస్థాగత నిర్మాణం ఉన్న రాజకీయ పార్టీలు చాలా తక్కువని వ్యాఖ్యానించారు. “ఏ రాజకీయ పార్టీలకు నిజమైన ప్రజాస్వామ్య నిర్మాణం ఉందో పరిశీలిస్తే.. అలాంటి ప్రజాస్వామ్య చట్రం ఉన్న అతికొద్ది పార్టీలలో బీజేపీ ఒకటని మీకు అర్థమవుతుంది” అని ఆయన అన్నారు. ఉత్తర భారతదేశ అభివృద్ధి ప్రాధాన్యతలు, అవకాశాలపై చర్చించేందుకు రాజకీయ నాయకులు, పరిపాలనాధికారులు, వ్యాపార, సాంకేతిక, వినోద, క్రీడా రంగాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ రెండు రోజుల పాటు ఈ న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్ జరుగుతోంది.

