Last Updated:
BHEL Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అలర్ట్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)లో 660 ఆర్టిజెన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణలోనే 180 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ITI అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు నవంబర్ 18 చివరి తేదీ కావడంతో వెంటనే అప్లై చేయండి.
ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా నిరంతరం కష్టపడి చదువుతున్న నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో మొత్తం 660 ఆర్టిజెన్స్ గ్రేడ్-IV పోస్టులను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవడం మంచిది. అర్హతలు ఉన్నవారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.
BHEL విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ ప్లాంట్‌లో 120 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ హెవీ పవర్ ఎక్విప్మెంట్ ప్లాంట్‌లో 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ రెండు యూనిట్లలో కలిపి 180 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన పోస్టులు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని BHEL యూనిట్లలో ఉన్నాయి.
మొత్తం 660 పోస్టుల్లో ఫిట్టర్ ట్రేడ్‌లో అత్యధికంగా 278 ఖాళీలు ఉన్నాయి. వెల్డర్‌లో 104, మెషినిస్ట్‌లో 101, ఎలక్ట్రీషియన్‌లో 90, టర్నర్‌లో 52, ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌లో 23, ఫౌండ్రీమ్యాన్లో 12 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తమకు సంబంధించిన ట్రేడ్‌లోని ఖాళీలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ITI/NTC, NAC అర్హతలు ఉండాలి. ITI, NAC రెండింటిలోనూ జనరల్, OBC అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, SC, ST అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉండాలి. 2026 అక్టోబర్ 1 నాటికి జనరల్, EWS అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. SC, ST అభ్యర్థులకు ఐదేళ్లు, OBC అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
ఎంపికైన వారికి ఆర్టిజెన్స్ గ్రేడ్-IV వేతన శ్రేణి కింద నెలకు రూ.29,500 నుంచి రూ.65,000 వరకు జీతం లభిస్తుంది. అయితే రెగ్యులరైజేషన్‌కు ముందు ఉండే ఏడాది తాత్కాలిక కాలంలో నెలకు రూ.24,000 స్థిర వేతనం చెల్లిస్తారు.
అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), నైపుణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. UR, EWS, OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1,072 కాగా, SC, ST, PwBD, మాజీ సైనికులకు రూ.472గా నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 21న ప్రారంభమైంది. నవంబర్ 18, 2026 రాత్రి 11:45 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షను డిసెంబర్ 11న నిర్వహించే అవకాశం ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు BHEL అధికారిక కెరీర్స్ వెబ్సైట్ https://careers.bhel.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

