Last Updated:
కరూర్ వైశ్యా బ్యాంక్ ఒక్కరోజులో 16 కొత్త శాఖలను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా శాఖల సంఖ్య 919కి చేరింది. తాజాగా ప్రారంభించిన 16 బ్రాంచ్‌లల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల శాఖలు ఉన్నాయి.
కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటి. తాజాగా ఒక్కరోజులోనే 16 కొత్త శాఖలను ప్రారంభించింది. దీంతో దక్షిణ భారతదేశంతో పాటు ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనూ బ్యాంక్ తన సేవలను మరింత విస్తరించింది. ఈ కొత్త శాఖలతో దేశవ్యాప్తంగా కేవీబీ శాఖల సంఖ్య 919కి చేరింది. కొత్తగా ప్రారంభించిన 16 శాఖల్లో తమిళనాడులో 6, ఆంధ్రప్రదేశ్‌లో 5, తెలంగాణలో 3, కర్ణాటకలో 1, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 1 శాఖ ఉన్నాయి. ఒకే రోజున పలు ప్రాంతాల్లో శాఖలు ప్రారంభించడం కేవీబీ విస్తరణలో కీలకమైన అడుగుగా నిలిచింది. కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రమేష్ బాబు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి శాఖను స్వయంగా ప్రారంభించారు. మిగతా శాఖలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. బ్యాంక్ బ్రాంచ్‌ల విస్తరణపై కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ, సీఈఓ రమేష్ బాబు న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ తమ వ్యూహాలను వివరించారు. “మాకు మేమే కాంపిటీటర్. ఇతర బ్యాంకులతో పోలిస్తే వాళ్ల ప్రొడక్ట్స్ వేరు, సర్వీసులు వేరు. కానీ ఒకసారి కస్టమర్ బ్యాంకులోకి వచ్చిన తర్వాత అతనికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ వస్తుందన్నదే మాకు ముఖ్యం. మా ప్రధాన లక్ష్యం ఏంటంటే… ఎంత మంది కస్టమర్లు ఉన్నా సరే, వారికి ఇదే స్థాయిలో సేవలు అందించగలగాలి. కాంపిటీషన్ విషయానికి వస్తే, గత ఐదేళ్లుగా మార్కెట్‌లో చాలా కాంపిటీషన్ ఉంది. అయినప్పటికీ మేము ప్రతి నాలుగేళ్లలో 1 లక్ష కోట్ల బిజినెస్‌ను చేరుకోగలుగుతున్నాం. 105 సంవత్సరాల చరిత్ర ఉన్న బ్యాంక్‌గా ఇది సాధ్యమవుతోంది” అని రమేష్ బాబు చెప్పారు.

