Last Updated:
ఆదిలాబాద్ నార్నూర్ లోని కొలాం గిరిజనులు ఆత్రం జలపతిరావు, మడావి రాము వెదురుతో గృహాలంకరణ కళాఖండాలు తయారు చేసి జాతరల్లో అమ్ముతూ మహిళలకు శిక్షణ ఇస్తున్నారు
పుట్టుకతోనే శారీరక వైకల్యం అతనికి ఎదురైనా, తనలోని కళా ప్రతిభను మాత్రం ఎవరూ అడ్డుకోలేకపోయారు. అడవిలో నుంచి తండ్రి తీసుకొచ్చే సాధారణ వెదురుకు తన చేతులతో ప్రాణం పోసి అద్భుతమైన కళాఖండాలుగా మలుస్తున్నాడు. అతనికి మామ వరుస అయ్యే మరో వ్యక్తి తోడవడంతో ఇద్దరూ కలిసి సంప్రదాయ వెదురు పనికి సరికొత్త రూపునిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాము తయారు చేసిన వెదురు కళాఖండాలతో వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రదర్శనలు, జాతరలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి తమ ప్రతిభను చాటుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మారుమూల కొలాం గిరిజన గ్రామం నడ్డంగూడకు చెందిన ఆత్రం జలపతిరావు, మడావి రాము ఈ అరుదైన కళను జీవనోపాధిగా మార్చుకున్నారు. వీరి తండ్రులు, తాతలు అడవిలో నుంచి వెదురును తీసుకొచ్చి గంపలు, తడకలు, బుట్టలు అల్లుతూ జీవనం సాగించేవారు. అయితే సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చిన ఈ ఇద్దరు వెదురుతో గృహాలంకరణ వస్తువులు తయారు చేయడం ప్రారంభించారు. వాటికి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు వెదురుతో పక్షులు, ఎడ్లబండ్లు, అమ్ములపొదులు, ఫ్లవర్ పాట్స్, పూల కుండీలు, అలంకరణ వస్తువులు వంటి ఎన్నో ఆకర్షణీయమైన కళాఖండాలను రూపొందిస్తున్నారు.
పుట్టుకతో వికలాంగుడైన ఆత్రం జలపతిరావుకు ఆయన తండ్రే అడవిలో నుంచి వెదురును తీసుకొచ్చి అందిస్తుంటారు. అవసరమైనప్పుడు నాగ్‌పూర్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వెదురును కొనుగోలు చేస్తారు. వెదురుతో తయారైన చిన్న ఫ్లవర్ పాట్‌నే రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తుండగా, వస్తువును బట్టి ధరలు మారుతుంటాయి. చేతిపనితో తయారైన ఈ కళాఖండాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని వారు చెబుతున్నారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఈ కళను కొనసాగిస్తున్న జలపతిరావు, మడావి రాము కేవలం వస్తువులు తయారు చేయడానికే పరిమితం కాలేదు. గ్రామీణ మహిళలకు వెదురు కళలో శిక్షణ కూడా అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. తమ పనిని మరింత సులభతరం చేసేందుకు చిన్న చిన్న యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొందరు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చి తమకు నచ్చిన నమూనాల్లో వెదురు వస్తువులను తయారు చేయించుకుంటుండగా, వివిధ జాతరలు, మేళాలు, ప్రభుత్వ ప్రదర్శనల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి తమ కళాఖండాలను ప్రదర్శిస్తూ విక్రయిస్తున్నారు.
సాధారణ వెదురును అపురూపమైన కళాఖండంగా మార్చే ఈ కొలాం గిరిజన కళాకారుల ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటోంది. సంప్రదాయ కళను ఆధునిక అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కళాకారులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు, ఆర్థిక సహాయం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా తమ ప్రతిభను చాటుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారి చేతుల్లో వెదురు కేవలం ఒక అడవి ఉత్పత్తి కాదు.. అద్భుతమైన కళాఖండంగా, వారి జీవితానికి ఆశాకిరణంగా మారింది.
Warangal,Telangana
