ఈ కొత్త ఏఐ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింప్లిఫై ఆల్ఫా సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ వెంకటగిరి వందాలి, కంపెనీకి చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయి కృష్ణ కూడా కేంద్రాన్ని సందర్శించి కార్యక్రమంలో భాగమయ్యారు.
అమెరికా ఆరోగ్య బీమా రంగంలో ఎదురవుతున్న క్లిష్టమైన సమస్యలకు ఏఐ సాంకేతికతతో పరిష్కారాలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం హెల్త్‌కేర్ రంగంపై అవగాహన ఉన్న నిపుణులను, ఏఐ ఇంజినీర్లను ఒకే బృందంగా ఏర్పాటు చేయనుంది. సాధారణంగా ఆరోగ్య బీమా సంస్థల్లో క్లెయిమ్‌ల పరిశీలన, బీమా ప్రయోజనాల నిర్వహణ, ఆసుపత్రులతో సమన్వయం, వినియోగదారుల సేవలు వంటి పనులకు ఎక్కువ సమయం, మానవ వనరులు అవసరమవుతాయి. ఇలాంటి ప్రక్రియలను వేగవంతం చేయడానికి సింప్లిఫై ఆల్ఫా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయనుంది.
ఈ సంస్థ ప్రత్యేకంగా ‘డొమైన్ ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీరింగ్’ (Domain Forward Deployed Engineering) అనే విధానాన్ని అనుసరిస్తోంది. దీని ద్వారా హెల్త్‌కేర్ సంస్థలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను నేరుగా అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా సాంకేతిక పరిష్కారాలను రూపొందిస్తుంది. ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీరింగ్, ఏఐ ఫుల్‌స్టాక్ ఇంజినీరింగ్ బృందాలు హెల్త్‌కేర్ సంస్థలతో కలిసి పనిచేస్తాయి. ఇప్పటికే ఉన్న వ్యవస్థల్లో ఏఐని అనుసంధానించడం, మాన్యువల్ పనులను ఆటోమేట్ చేయడం, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం వీటి ప్రధాన బాధ్యతలు. ఫలితంగా ఆరోగ్య బీమా సంస్థల్లో సమయం వృథా కాకుండా, పనుల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుంది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో గత రెండున్నరేళ్లలో టెక్నాలజీ రంగం గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించడంలో హైదరాబాద్ వేగంగా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే 160కి పైగా గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లను రాష్ట్రానికి తీసుకువచ్చామని వెల్లడించారు. వీటి ద్వారా ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, ప్రత్యేక రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా మారుతోందని చెప్పారు.
సింప్లిఫై ఆల్ఫా రాకతో ఈ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇలాంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు స్థానిక యువతకు అధిక విలువ కలిగిన ఉద్యోగాలను అందించడంతో పాటు, కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి చేసే పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
సింప్లిఫై ఆల్ఫా సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ వెంకటగిరి వందాలి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. నగరంలో ఇప్పటికే బలమైన టెక్నాలజీ వ్యవస్థ, ప్రపంచ స్థాయి ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. కంపెనీ భవిష్యత్ విస్తరణకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏఐ, ఏజెంటిక్ ఏఐ మోడల్స్ ఆరోగ్య సంరక్షణ రంగంలో వేగంగా మార్పులు తీసుకొస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హెల్త్‌కేర్ రంగంపై లోతైన అవగాహన ఉన్న ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా తమ క్లయింట్లకు మరింత వేగంగా, మెరుగైన సేవలు అందించగలమని వివరించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి శ్రీధర్ బాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సింప్లిఫై ఆల్ఫా ఇప్పటికే అమెరికాలో 70కి పైగా ప్రధాన హెల్త్ ప్లాన్‌లకు సాంకేతిక సేవలు అందిస్తోంది. క్లెయిమ్‌ల నిర్వహణ, బీమా ప్రయోజనాలు, ఆరోగ్య సేవలు అందించే సంస్థల కార్యకలాపాలు, సభ్యుల అనుభవం వంటి కీలక విభాగాల్లో పరిష్కారాలను అందిస్తోంది. అమెరికా ఆరోగ్య బీమా వ్యవస్థలోని సంక్లిష్టమైన విధానాలను అర్థం చేసుకుని, వాటికి తగిన ఏఐ పరిష్కారాలను రూపొందించడం ఈ సంస్థ ప్రత్యేకత. హైదరాబాద్ కేంద్రం ద్వారా స్థానిక ఇంజినీర్లకు అమెరికా హెల్త్‌కేర్ రంగానికి సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానంతో పాటు అధునాతన ఏఐ సాంకేతికతపై పనిచేసే అవకాశం లభించనుంది. ప్రపంచ స్థాయి ఆరోగ్య బీమా సంస్థలకు అవసరమైన సాంకేతిక వ్యవస్థల రూపకల్పనలో హైదరాబాద్ నిపుణులు నేరుగా భాగస్వాములు కానున్నారు.
